అది బంగ్లాదేశ్-ఇండియా వన్డే మ్యాచ్. ఆదివారం టీవీల ముందు అందరూ రిలాక్స్ గా కూర్చున్నారు. 50 ఓవర్ల మ్యాచ్… కనీసం 300 దాటి కొడతారని అంతా అనుకుంటుంటే, ఒక్కసారిగా మనవాళ్లు నీరుకార్చేశారు.
చచ్చీ చెడి 183 చేశారు, లక్ష్యం చిన్నదే కానీ, బౌలర్లు మొదటి ఓవర్ నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ ని కట్టడి చేశారు. అలా 40 ఓవర్లు గడిచేసరికి 9 వికెట్లు తీశారు. అప్పటికి వారి స్కోరు 136 మాత్రమే. ఇంకా బంగ్లా విజయానికి కావల్సినవి 48 పరుగులు
ప్రతి పరుగు అతికష్టం మీద తీసిన బంగ్లాదేశ్ కి మిగిలిన 10 ఓవర్లలో, 48 పరుగులు సాధించడం కలలో మాటని భావించి అందరూ టీవీ ఛానల్స్ మార్చేసుకున్నారు. కాసేపటికి చూస్తే ఇంకేముంది? అందరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. మనవాళ్లు ఓడిపోయి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు.
కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ కలిసి చివర్లో చేతిలోకి వచ్చిన క్యాచ్ ని వదిలేయడం, మ్యాచ్ మన చేతుల్లోంచి జారిపోవడం టీవీల్లో కనిపిస్తుండేసరికి అభిమానులు చాలా ఫీలయ్యారు. అయితే అదే మాట కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ‘నేను చాలా ఫీలయ్యాను’ అని చెప్పడం విశేషం.
వ్యక్తిగత రికార్డుల కోసమేగానీ, జట్టు ప్రయోజనాల కోసం ఆడేవారు కనిపించడం లేదని, ఐపీఎల్ మీద ఉన్న శ్రద్ధ ఇండియన్ క్రికెట్ పై లేదనే విమర్శలు మళ్లీ తీవ్రంగా వినిపిస్తున్నాయి