భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశం గొప్పనేతను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. విద్య, పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఒకరని కొనియాడారు. భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీలకపాత్ర పోషించారన్నారు. దేశానికి ఆయన చేసిన సేవ, ఆయన రాజకీయం జీవితం, వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ఆయన మృతి దేశానికి తీరనిలోట్నారు. భరతమాత ముద్దుబిడ్డల్లో ఒకరైన మన్మోహన్‌కు మనస్ఫూర్తిగా నివాళులర్పించారు రాష్ట్రపతి ముర్ము.
దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చారన్నారు భారత ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్. మన్మోహన్ సింగ్ ఇక లేరన్న విషయం చాలా బాధకు గురిచేసిందన్నారు. ఆర్థిక సరళీకరణ రూప శిల్పిగా పేరు గడించారని…. ఎంతో ధైర్యం ప్రదర్శించి కఠిన నిర్ణయాలతో దేశం ముందుకు సాగేలా చేశారన్నారు. దేశ అభివృద్ధికి ఎన్నో ద్వారాలు తెరిచాన్న ఆయన ఉప రాష్ట్రపతిగా ఆయనతో ఎన్నో సంభాషణలు జరిపానని తెలిపారు. ఆర్థిక విధానం పట్ల ఆయనకున్న ప్రగాఢ విశ్వాసం, దేశ పురోగతి పట్ల అచంచల నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పుకొచ్చారు. భారత దేశం మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయిందని… ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు జగ్‌దీప్ ధన్‌ఖడ్
భారతదేశం విశిష్టమైన వ్యక్తుల్లో ఒకరైన మన్మోహన్ సింగ్‌ను కోల్పోయిందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఎంతో నిరాడంబరంగా ఉండే ఆయన ఆర్థికవేత్తగా ఎదిగారని… ప్రధానిగానే కాకుండా ఆర్థిక మంత్రితో పాటు ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో పనిచేశారన్నారు. దేశ ఆర్థిక విధానంపై ఎన్నో ఏళ్లుగా బలమైన ముద్రవేశారని…. పార్లమెంట్‌లో ఆయన ప్రసంగాలు గొప్పగా ఉండేవని చెప్పారు. ప్రధానిగా దేశ ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు ఎంతో కృషి చేశారని తెలిపారు. మన్మోహన్ ప్రధానిగా, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరుచూ మాట్లాడుకునేవాళ్లమని గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. ఆయన జ్ఞానం, వినయం ఎల్లప్పుడూ ప్రస్ఫుటించేవన్నారు. ఈ సమయంలో నా ఆలోచనలన్నీ ఆయన కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయని మోదీ పేర్కొన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరన్న వార్త చాలా బాధ కలిగించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నుంచి ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశ పాలనలో కీలక పాత్ర పోషించారని… ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని భగవంతుణ్ని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు.
గురువు, మార్గదర్శిని కోల్పోయానని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని నడిపించారన్నారు. ఆర్థికశాస్త్రంలో ఆయన లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.