ముంపు ప్రాంతాలను సందర్శించిన రమణరాజు
అకాల వర్షానికి కాకినాడ స్మార్ట్ సిటీ మొత్తం పూడిక, ముంపు నీటితో తల్లడిల్లిందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం కళ్లు తెరిచి, కాకినాడలో ముంపు నివారణకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముంపు ప్రాంతాలను సందర్శించిన రమణరాజు ప్రభుత్వానికి నివేదిక పంపించారు.
సొసైటీ పై ఆరోపణలు
రైతుల అభివృద్ధి కోసమే సొసైటీ పనిచేస్తోందని మేడ్చల్ PACS చైర్మన్ రణదీప్‌రెడ్డి అన్నారు. తమ సొసైటీపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. రైతులు మంచి వడ్లను సొసైటీకి తీసుకువస్తే.. తీసుకొని 48 గంటల్లో వారి ఖాతాల్లోకి డబ్బులు జమచేస్తామని రణదీప్‌రెడ్డి చెప్పారు. తనపై అనవసర ఆరోపణ చేయడం తగదని మండిపడ్డారు.
తప్పిన ముప్పు
చిత్తూరులో శుక్రవారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. చిత్తూరులోని కట్టమంచిలో శుక్రవారం రాత్రి ఓ యువకుడు కారుతో నేరుగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నాడు. దీంతో విద్యుత్ స్తంభం విరిగిపడింది. సకాలంలో విద్యుత్ సరఫరా ఆపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బెంగళూరుకు చెందిన యువకుడు తాగిన మైకంలో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. రద్దీగా ఉన్న సమయంలో హఠాత్తుగా ఈ సంఘటన జరగడంతో ప్రజలు భయభ్రాంతులయ్యారు.
విద్యార్థుల డిమాండ్
తాండూర్ పోలీస్ స్టేషన్‌లో విద్యార్థి నాయకుడుపై దాడి చేసిన కానిస్టేబుల్ సత్తార్, ఎస్సై కాశినాధ్‌ను వెంటనే సస్పెండచేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ తాండూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. అకారణంగా బూతులు తిట్టారని ఆరోపించారు. ఫిర్యాదు తీసుకోకుండా.. దాడి చేశారని విద్యార్థి సంఘాలు తెలిపారు. శ్రీనివాస్ ను కొడుతూ పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లిన కానిస్టేబుల్ సత్తార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, అతడికి వత్తాసు పలికిన ఎస్సై కాశీనాథ్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక DSPని కలిసి వినతి పత్రం అందచేశారు.
భారీ వర్షం
కర్నూలులో భారీ వర్షం కురిసింది. గంటకు పైగా వర్షం కురవడంతో రహదారులన్నీ జలమాయం అయ్యాయి. ఉక్కపోతగా ఉన్న వాతావరణం చల్లబడడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు గడివేముల, పాణ్యం మండలాల్లో శుక్రవారం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల వల్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. సుమారు 15 స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కాలనీలో వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
పరిస్థితి విషమం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పిడుగు పడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన హనుమంతు అనే యువకుడు తన ద్విచక్ర వాహనంపై రివర్స్ కాలనీ మైదానంలో వెళ్తుండగా ఒకసారిగా పిడుగు పడింది. దాంతో హనుమంతుకు తీవ్ర గాయాలు కాగా పక్కనే ఉన్న స్థానికులు గమనించి వెంటనే యువకున్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, హనుమంతు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత నిమిత్తం కర్నూలుకు తరలించారు. హనుమంతుకు గత రెండు నెలల క్రితమే వివాహం అయినట్లు తండ్రి తెలిపారు.
అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా పహడి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రావిర్యాల హార్డ్ వేర్ పార్కులో శ్రీనాథ్ వొవెన్ ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనిలో అగ్నిప్రమాదం జరిగింది. కంపెనీలోని ఒకటో నెంబర్ యూనిట్లో భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు మంటలతో కంపెనీ సిబ్బంది ఉక్కరి బిక్కిరి అయ్యారు. ఘటన సమయంలో కార్మికులు ప్లాస్టిక్ ప్యాకింగ్ తయారు చేస్తున్నారు. కంపెనీలో ఉన్న సిబ్బంది మొత్తాన్ని బయటికి పంపించారు. సుమారు 10 ఫైర్ ఇజండ్లతో మంటల అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది.