తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల బెట్టింగ్ జోరందుకుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వేదికలుగా కాయ్ రాజా కాయ్ అంటున్నాయి బెట్టింగ్ ముఠాలు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో అభ్యర్థుల గెలుపోటమలుపై పందేల జోరు కొనసాగుతోంది. అంతేకాదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది..? ఎవరికి ఎంత మెజార్టీ వస్తుందన్న దానిపై బెట్టింగ్ కాస్తున్నారు. ఇక ప్రముఖులు బరిలో దిగిన చోట ఈ వ్యవహరం మరింత జోరందుకుంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఏపీ ఎన్నికలపై ప్రధానంగా బెట్టింగ్ జోరు నడుస్తోంది. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఓటు పోటెత్తడం వెనుక అభ్యర్థుల భవితవ్యంపై కాయ్ రాజా కాయ్ అంటూ పందేలు జోరు కొనసాగుతోంది. జూన్ 4న ఫలితాల విడుదలకానుండగా.. ఇప్పటి నుంచే కోట్ల రూపాయలతో బెట్టింగ్ కాస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖులపై బెట్టింగ్ హవా నడుస్తున్నట్టు సమాచారం. సీఎం జగన్, చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్, షర్మిల వంటి నేతలపై బెట్టింగ్ జోరుగా ఉంది. పార్టీలో నేతలు గెలుపు కోసం సర్వ శక్తులు వడ్డినట్లే. అదే స్థాయిలో బెట్టింగ్ టీమ్‌లు స్పీడ్ పెంచాయి. ఇటీవల వచ్చిన జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థల సర్వేల ఆధారంగా ఈ పందాలు కాస్తున్నట్టు తెలుస్తోంది.
ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో మెజార్టీ స్థానాలపై బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ఇందులో సామాన్య ప్రజలు సైతం భాగస్వాములవతున్నారు. పోలింగ్ నుంచి ఫలితాలు విడుదలకు చాలా గ్యాప్ ఉండటంతో బెట్టింగ్‌లలో భాగంగా బాండ్ పేపర్లపై సంతకాలు చేసుకుం టున్నారు బెట్టింగ్ బాబాలు. మధ్య వర్తికి 2.5 లక్షలు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. బెట్టింగ్ లో నగదు, ల్యాండ్, వాహనాలను సైతం పెడుతున్నారు. గెలిచిన వారికి నగదు ఇచ్చేలా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఇక గోదావరి జిల్లాల్లో ఉండి, దెందులూరు, భీమవరం స్థానాలపై జోరుగా పందాలు కాస్తున్నారు. నరసాపురం పార్లమెంటు, ఏలూరు పార్లమెంటు స్థానలపై కూడా బెట్టింగులు సాగుతు న్నాయి. ఇక పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బరిలో నిలవడంతో ఈసారైనా సేనానిని గెలుపు వరిస్తుందా అన్న ఆసక్తి నెలకొన్న సందర్భంగా బెట్టింగ్ బాబాలు దాన్ని సొమ్ము చేసుకుం టున్నా యి. ఎవరు గెలుస్తారు. ఎంత మెజార్టీ వస్తుందనే దానిపై బెట్టింగ్ జోరందుకుంది. మంగళగిరి, కడప, భీమిలి, రాజంపేట స్థానాలపై కూడా సాగుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంత పురం అర్బన్, రాప్తాడు, తాడిపత్రి, ధర్మవరం, హిందూపూరం నియోజకవర్గాలపైనా బెట్టింగ్లు సాగుతు న్నాయి. ఫలితాలు వచ్చేలోపు కోట్ల రూపాయలు చేతులు మారనున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జగన్‌ను గద్దె దించేందుకు ప్రభుత్వ ఓటు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీలు ఒక్కటిగా ఎన్నికల బరిలో దిగాయి. దీంతో కూటమి వర్సెస్ అధికార పార్టీ అన్నట్టుగా సాగింది ప్రజాక్షేత్ర పోరు. ఇక సొంత అన్న జగన్ ఓటమికి కంకణం కట్టుకున్న తోబుట్టువు షర్మిల కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి రణ రంగంలో నేను సైతం అంటూ రాజకీయ యుద్ధం మొదలుపెట్టింది. అంతా ఏకమైనా.. జగన్ మాత్రం ముందు నుంచి చెబుతున్నట్టు సింగిల్‌గానే పోటీ చేశారు. దీంతో ఈసారి ఎన్నికల రణరంగం నువ్వా నేనా, చావో రేవో అన్నట్టుగా సాగింది. ఇక ఈ పోరులో ఓటర్లు తమ వంతు పాత్ర నిర్వహిస్తూ భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే, ఓటర్ల ఉత్సాహం చూసిన నేతలంతా తమకే మద్దుతు తెలిపారన్న భ్రమలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతోనే ఓటర్లు పోటెత్తారని విపక్షాలు చెబుతుంటే, అదేం కాదు. తమ సంక్షేమ పథకాల కారణంగానేనంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది, ఎవరు నెగ్గుతారు..? ఎవరు మీసం మెలేస్తారన్నది తెలియాలంటే మాత్రం ఫలితాలు విడుదలయ్యే వరకూ వేచి చూడాల్సిందే.