తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7 నాటికి సంవత్సర కాలం పూర్తి కావస్తోంది. ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో ఇప్పటికే హస్తం పార్టీ సంబరాలు జరుపుకుంటోంది. పదేళ్ల తర్వాత మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం..గత ఎన్నికలలో ఇచ్చిన హామీలు కొంతవరకు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక దాదాపు 55 వేల ఉద్యోగ నియామకాలను చేపట్టారు. అలాగే రైతు బీమా, రైతు రుణమాఫీ అలాంటివి చేశారు. దేశంలో ఎక్కడా లేనటువంటి స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఏడాది పాలనలో తెలంగాణ వివిధ రంగాల్లో ప్రగతి పథంలో సాగుతోందని కాంగ్రెస్ ప్రభుత్వం వివరించింది. ఏడాది వ్యవధిలోనే అనేక సంస్కరణలతో ముందుకు సాగినట్లు చెప్పింది. ఈనేపథ్యంలోనే రవాణా, ఆర్టీసీ ప్రగతి నివేదికలను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఐటీ, పరిశ్రమలు, క్రీడా, కార్మిక శాఖల ప్రస్థానాన్ని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. రోడ్లు, భవనాల శాఖల ప్రగతిని ప్రభుత్వం విడుదల చేసింది. రహదారి భద్రత, కాలుష్య నియంత్రణే లక్ష్యంగా ఏడాది వ్యవధిలో అనేక సంస్కరణలు చేపట్టినట్లు రవాణా శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 112 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీ చేశామని, 63 ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపింది. 2023 డిసెంబరు 9 నుంచి 2024 డిసెంబరు 3 వరకు తెలంగాణలో 78వేల 262 ఈవీల రిజిస్ట్రేషన్లు జరిగాయని వివరించింది. రవాణా శాఖకు ఇప్పటి వరకు ప్రత్యేకంగా లోగో లేకపోవడంతో టీజీటీడీ పేరుతో నూతన లోగోను రూపొందించింది.
ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు లబ్ధి చేకూర్చడంతోపాటు ఆర్టీసీకి ఆర్థికంగా మేలు చేస్తోందని..తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలిపింది. జీరో టికెట్ల నగదును ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్టీసీకి రీయింబర్స్ చేస్తోందని, గతంలో నష్టాల్లో ఉన్న సంస్థ ఈ చెల్లింపులతో లాభాల బాటలోకి వెళ్లిందని వివరించింది. రద్దీకి అనుగుణంగా ఏడాది వ్యవధిలో ఒక వెయ్యి 389 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. కాలుష్య నివారణకు హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లలో 251 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించామని తెలిపారు. ఆర్టీసీలో దాదాపు 12 ఏళ్ల తర్వాత 3వేల38 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వం త్వరలోనే వాటిని భర్తీ చేస్తుందని ఆర్టీసీ వెల్లడించింది.
ప్రభుత్వం రోడ్ల అభివృద్ధి, మరమ్మతులకు ప్రాధాన్యమిస్తోందని ఆర్అండ్‌బీ శాఖ పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో7వేల 490 కోట్లు కేటాయించిందని చెప్పింది. ఇందులో ఆర్‌అండ్‌బీ పనులను 5వేల 790 కోట్లు, ఓఆర్‌ఆర్‌కు 200 కోట్లు, ప్రాంతీయ వలయ రహదారికి ఒక వెయ్యి 500 కోట్లను కేటాయించినట్టు తెలిపింది. కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ ఇతర రాష్ట్రాలతో అనుసంధానం చేసే జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చామన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న 17 బ్లాక్ స్పాట్లను గుర్తించడంతోపాటు మరమ్మతులు చేపట్టేందుకు 422.12 కోట్లు మంజూరయ్యేలా కృషి చేశామన్నారు. రాష్ట్రం గుండా వెళ్లే ఎన్‌హెచ్-353కు 662.67 కోట్లు, ఎన్‌హెచ్-565కు 516.17 కోట్లు..ఇలా 11 నెలల్లో 272 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల అభివృద్ధికి 2వేల 86 కోట్లు కేంద్రం ద్వారా మంజూరు చేయించడంలో సర్కారు సఫలమైందని ఆర్‌అండ్‌బీ శాఖ వివరించింది.
ఇక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా 84వేల 394 మంది కార్మికుల కుటుంబాలకు వివిధ పథకాలను వర్తింపజేయడానికి..ఆర్థిక సహాయం అందించేందుకు 370.28 కోట్లు ఖర్చు చేసినట్లు కార్మికశాఖ వెల్లడించింది. ఐటీఐల్లో 282 జాబ్ మేళాలు నిర్వహించగా..2వేల 457 మంది ఉద్యోగాలు సాధించారని చెప్పింది. గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించామని, ఇప్పటికే 1.6 లక్షల అసంఘటిత రంగ కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారని తెలిపారు.
యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 65 ప్రభుత్వ ఐటీఐలను అప్‌గ్రేడ్ చేసిందని చెప్పారు. 2వేల 738.72 కోట్ల ఖర్చుతో టాటా టెక్నాలజీస్ సహకారంతో ఆధునిక శిక్షణ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేసిందని వివరించారు. ఇప్పటికే 650 కోట్లు విడుదల చేశారని వెల్లడించారు. ప్రభుత్వం కొత్తగా రంగారెడ్డి జిల్లా పంజాగూడకు, కరీంనగర్ జిల్లా రుద్రంగికి రెండు కొత్త ఏటీసీలను 84.84 కోట్ల వ్యయంతో మంజూరు చేసిందన్నారు అధికారులు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే 25 ఏటీసీలు కార్యకలాపాలు ప్రారంభించాయని చెప్పారు.. 15 ఏటీసీల్లో 100 శాతం ప్రవేశాలు పూర్తయ్యాయని తెలిపారు. 5 లక్షల ప్రమాదబీమా పథకం కింద 13లక్షల 51వేల 242 మంది నమోదయ్యాయన్నారు. వారిలో 13లక్షల 11వేల 72 మంది డ్రైవర్లు, 22వేల 515 మంది వర్కింగ్ జర్నలిస్టులు, 17వేల 655 మంది హోంగార్డులు ఉన్నారని ప్రభుత్వం వివరించింది.