ఏపీకి గ్రీన్ ఎనర్జీ రూపంలో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ తయారవుతుందని.. మిగిలిన ప్రాంతాల్లో తయారయ్యే సౌర, పవన, పంపడ్ స్టోరేజ్ విద్యుత్‌ను పూడిమడకకు తెచ్చి వాటి ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తామని చెప్పారు. ఈ హైడ్రోజన్‌తో ఎరువులు, రసాయనాలు తయారవుతాయని ఆయన వివరించారు. హరిత ఇంధనం ద్వారా తయారయ్యే ఎరువులు, రసాయనాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తికి హైడ్రోజన్ వాడితే వేడి బాగా తగ్గుతుందని వివరించారు.
గ్రీన్‌కో కంపెనీ కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్స్‌ను టేకోవర్ చేయనుందని… ఇక్కడ గ్రీన్ అమోనియా తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్లాంట్‌పై రూ.25 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారని వెల్లడించారు. రిలయన్స్ కంపెనీ బయో కంప్రెస్డ్ గ్యాస్ తయారీకి 500 కేంద్రాలు పెడుతోందని.. ఒక్కో కేంద్రానికి రూ.130 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని స్పష్టం చేశారు. బయోగ్యాస్‌కు ఉపయోగపడే గడ్డి ద్వారా ఇది తయారవుతుందని చెప్పారు. గడ్డి పెంచడానికి ఎకరాకు రూ.30 వేలు కౌలు రైతులకు రిలయన్స్ చెల్లించనుందని చంద్రబాబు తెలిపారు.
బెంగళూరు సంస్థ స్వాపింగ్ బ్యాటరీల మోడల్‌ను కుప్పానికి తెచ్చిందని చంద్రబాబు స్పష్టం చేశారు. సూర్యఘర్ అమలులో ఉన్న ఇళ్ల యజమానులకు స్వాపింగ్ బ్యాటరీల ఛార్జింగ్‌కు డబ్బు చెల్లిస్తారన్నారు. దీంతో వారికి అదనపు ఆదాయం చేకూరనుందని చెప్పారు. సౌర విద్యుత్ ఉత్పత్తిపై కొత్త ఆలోచనలు చేస్తున్నామన్న చంద్రబాబు… ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం సౌర ఫలకాలు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.