స్వతంత్ర వెబ్ డెస్క్: శ్రీవారి దర్శనానికి కాలిబాటన వచ్చే మార్గాన్ని మూసివేయాలని ఆలోచిస్తున్నట్లు తిరుమల, తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి (TTD EO) పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి అలిపిరి (Alipiri) బాటన చిన్నారిని చంపివేసిన చిరుత(Leopard) ఘటనపై శనివారం తిరుమల జేఈవో కార్యాలయంలో అటవీ శాఖ, పోలీసులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. చిరుత దాడిలో చనిపోయిన చిన్నారి లక్షిత (Lakshita) ఘటన బాధకరమని ఆయన అన్నారు.
శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు పాప మిస్ అయ్యిందని, పాప ఆచూకీ కోసం70 మంది దాకా సిబ్బంది రాత్రి అటవీ ప్రాంతంలో గాలించారని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా చూస్తే కాలినడక నుంచి పాప అటవీ ప్రాంతంలో వెళ్లిందా అనే కోణంలో విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. తిరుపతి నుంచి తిరుమల ఉన్న రెండు కాలిబాటలను సాయంత్రం 6 గంటలకు మూసేయాలని ఆలోచిస్తున్నామని వెల్లడించారు. ఈ విషయంపై టీటీడీ చైర్మన్, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని , ప్రతి పది మీటర్లకు సెక్యూరిటీ గార్డును నియమిస్తామని వివరించారు. కాలిబాటలో బోన్లు ఏర్పాట్లు చేస్తామన్నారు. చిరుతను బంధించేందుకు ఇప్పటికే రెండు బోన్లు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. కాలిబాటలో వచ్చే భక్తులు చిన్న పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.