వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఆకేరువాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా పట్టపగలే నిర్భయంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ, పోలీసుల నిఘా కొరవడి టన్నుల కొద్ది ఇసుక అక్రమంగా తరలిపో తుందని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారుల అండదండలతోనే యాదేచ్చగా ఇసుక అక్రమర వాణా జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయానికి, పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న కొత్తపల్లి, ల్యాబర్తి, ఇల్లంద గ్రామాలకు పక్కనే ఉన్న వాగులో నుంచి అక్రమార్కులు ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు. అయినా మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వెలువెత్తు తున్నాయి. వాగులో నుంచి 200 నుంచి 300 ట్రాక్టర్ టిప్పుల ఇసుక అక్రమంగా చుట్టు పక్క గ్రామాలకు, వరంగల్ పట్టణానికి రవాణా చేస్తున్నట్లు సమాచారం. రెవెన్యూ,పోలీస్ అధికారులు అప్పుడప్పుడు వచ్చి మామూళ్ళు వసూలు చేసుకోని పోతారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమా ర్కులపై చర్య తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


