Janasena | వైసీపీ ముఖ్య నాయకుల నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకూ ఇసుక దోపిడీ ప్రధాన ఆదాయ మార్గమైపోయిందని మండిపడ్డారు జనసేన వ్యవహారాల ఇంచార్జ్ నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీ నుంచి ఓ ప్రకటనను విడుదల చేస్తూ.. ఇసుక బకాసురులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డగోలుగా ఇసుక, మట్టి తవ్వేస్తున్నా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందని పేర్కొన్నారు. అక్రమ తవ్వకాలపై న్యాయ పోరాటం ద్వారానో, ప్రజా పోరాటం ద్వారానో అడ్డుకొంటున్న జనసేన నాయకులను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు.
మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలంలోని తాతపూడి దగ్గర గోదావరి తీరంలో అక్రమంగా ఇసుక, మట్టి తవ్వుతుండటంతో ఆ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ హైకోర్టులో పోరాడుతున్నారని తెలిపారు. అక్కడి లంక భూముల్లో యధేచ్చగా ఇసుక, మట్టి తవ్వేస్తున్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. ఈ క్రమంలో శ్రీ లీలాకృష్ణతోపాటు మరో ముగ్గురు జనసేన కార్యకర్తలపై కేసులు నమోదు చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దోపిడీని అడ్డుకొంటే కేసులుపెడతారా? అంటూ ప్రశ్నించారు. అప్రజాస్వామికమైన ఈ అక్రమ కేసులపై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తాం. గోదావరి ప్రవాహాన్ని అడ్డుకొనేలా రోడ్డు వేసి మరీ తవ్వుతున్నారు అంటే దోపిడీ కోసం వైసీపీ నాయకులు ఏ స్థాయిలో బరి తెగిస్తున్నారో అర్థమవుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగుతున్న ఇసుక, మట్టి దోపిడీని జనసేన పార్టీ కచ్చితంగా నిలువరిస్తుందని తెలిపారు.


