శిక్ష అనేది మనుషుల్లో పరివర్తన తీసుకువచ్చేదిగా ఉండాలంటారు న్యాయరంగ నిపుణులు. ఈమేరకు న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం అంటున్నారు. కంటికి కన్ను సిద్ధాంతాన్ని అవలంబిస్తే, ప్రపంచమంతా అంధులతో నిండిపోతుంది అన్న జాతిపిత మహాత్మా గాంధీ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.అయితే న్యాయవ్యవస్థ లో మార్పుల పేరుతో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల్లో ఎక్కడా ఖైదీల పరివర్తన అనే ముచ్చటే కనిపించడం లేదు.
నేరాల విచారణ ప్రక్రియలో నిన్న మొన్నటివరకు అమలులో ఉన్న మూడు క్రిమినల్ చట్టాలు ఎంతో ముఖ్యమైనవి. ఏ నేరానికి ఏ శిక్ష విధించాలన్న విషయాన్ని ఇండియన్ పీనల్ కోడ్ వివరిస్తుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో అరెస్టులు, విచారణ పద్ధతులకు సంబంధించిన సమస్త వివరాలు ఉంటాయి. కేసులో పేర్కొన్న అభియోగాలను న్యాయస్థానం ముందు రుజువు చేయడం, వాంగ్మూలాలు ఎలా రికార్డు చేయాలి ? నిందితుడు, నేరం చేశాడనడానికి కోర్టు ముందు సాక్ష్యాధారాలను ఎలా ప్రవేశపెట్టాలి అసలు ప్రాసిక్యూషన్ బాధ్యత ఏమిటి ? ఇవన్నీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వివరిస్తుంది. అయితే ఈ మూడు చట్టాలు, వలసపాలనకు ఆనవాళ్లు అనేది కేంద్ర ప్రభుత్వం వాదన.ప్రస్తుత కాలానికి అనుగుణంగా కొత్త చట్టాలను తీసుకువస్తున్నామని కొన్ని నెలల కిందట లోక్‌సభలో హోమ్ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మూడు క్రిమినల్ చట్టాల్లో మొత్తంగా 313 మార్పులు ప్రతిపాదించింది కేంద్రం. అయితే అనేక నేరాలకు సంబంధించి గతంలో ఉన్న శిక్షలను ప్రస్తుతం భారీగా పెంచారు.
నేరం చేసిన వాళ్లు వందమంది తప్పించుకుపోయినా పర్లేదు కానీ ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదన్నది మౌలికంగా మన న్యాయవ్యవస్థ అంతస్సూత్రం. దీనికి తూట్లు పొడుస్తున్నాయి తాజా చట్టాలు. మనదేశంలో ప్రస్తుతం కన్విక్షన్ రేటు అంటే శిక్షల పడ్డ శాతం చాలా తక్కువగా ఉందన్నది కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం. రానున్న రోజుల్లో ఫోరెన్సిక్ సైన్స్ సాయంతో కన్విక్షన్ రేటును 90 శాతం వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అమిత్ షా లోక్‌సభలో వెల్లడించారు. అంటే పరోక్షంగా నిరపరాధులకు కూడా శిక్షలు పడే పెను ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు న్యాయరంగ నిపుణులు. కొన్ని నేరాలకు సంబంధించి కొత్త చట్టాల్లో శిక్షల తీవ్రతను పెంచారు. గ్యాంగ్ రేప్ కేసులో ఇప్పటివరకు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష ఉండేది. కొత్త చట్టాలలో ఇది గరిష్టంగా 20 ఏళ్లు ఉంటుంది. మొత్తంగా చూస్తే న్యాయవ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం చేయతలపెట్టిన సమూల మార్పులు పైకి చాలా గొప్పగానే కనిపిస్తున్నాయి.కానీ ప్రాక్టికల్‌గా భవిష్యత్తులో పరిస్థితులు దారుణంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. ఇప్పటివరకు నేరాల కిందకు రాని కొన్ని చర్యలను కొత్త చట్టాల్లో క్రైమ్ జాబితాలోకి చేర్చేశారు.
రాజద్రోహం లేదా దేశద్రోహం పేరు ఏదైనా అదొక నల్లచట్టం. జాతీయోద్యమకాలంలో దీనికి అంకురార్పణ జరిగింది. గాంధీజీ నాయకత్వంలో ఉవ్వెత్తున స్వాతంత్ర్య సమరం సాగుతున్న సమయం లో బ్రిటిష్ పాలకులు ఈ నల్లచట్టాన్ని తీసుకువచ్చారు. స్వాతంత్ర్య సమరానికి చెక్ పెట్టడమే ఈ నల్ల చట్టం ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, బ్రిటిష్ పాలకుల ఆదేశాలను ఎవరు ధిక్కరించినా వెనకాముందు చూడకుండా వారిపై ఈ చట్టం కింద కేసు పెట్టేవారు. జైళ్ల పాల్జేసేవారు. ముఖ్యంగా మహాత్మా గాంధిని అలాగే ఆయనతో కలిసి అడుగులేస్తున్న మిగతా నాయకులను అదుపు చేయడానికే నల్ల చట్టాన్ని తీసుకువచ్చింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. స్వాతంత్ర్య ఉద్యమ కాలం నాటి జాతీయ నాయకులను జైళ్లలో పెట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించిన దేశ ద్రోహం చట్టం అమలును సుప్రీంకోర్టు 2022లో నిలిపివేసింది. ఈ నల్లచట్టంపై సమీక్ష జరుపుతామని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టుకు వెల్లడించింది. కానీ కొత్త చట్టంలో తిరిగి దేశద్రోహ చట్టాన్ని రాజద్రోహం పేరుతో తీసుకువచ్చింది. ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి , ప్రజలకు ఉన్న హక్కుల ను అణచివేయడా నికి ఈ నల్ల చట్టం ఉపయోగపడుతుందన్న విమర్శలు వెల్లువెత్తాయి.
1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నల్ల చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చింది. దేశంలోని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, రాజ్యాంగ నిపుణులు ఈ డిమాండ్‌ను బలంగా వినిపించారు. అయితే ఈ డిమాండ్‌ను పాలకులు పట్టించుకోలేదు. దీంతో కొంతకాలం పాటు ఈ చట్టం విషయమై ఎవరూ మాట్లాడలేదు. అయితే వీలు దొరికినప్పుడల్లా నల్ల చట్టాన్ని ప్రస్తావించడం మానలేదు ప్రజాస్వామ్యవాదులు. జాతీయోద్యమాన్ని తుంగలో తొక్కడానికి రూపొందించిన రాజద్రోహం చట్టాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏమున్నదని పాలకులను ప్రశ్నించారు. అసలే రాచరికమే కాలగర్భంలో కలిసిపోయక ఇక రాజద్రోహ చట్టాన్ని కొనసాగించడంలో అర్థం లేదన్నారు అభ్యుదయవాదులు. ఈ నేపథ్యంలో రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ మరోసారి జోరందుకుంది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ పిటిషన్ విచారణ సందర్భంగా రెండేళ్ల కిందట సర్వోన్నత న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది. రాజద్రోహం చట్టాన్ని మరోసారి సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నాయకత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. అంతేకాదు అప్పటివరకు రాజద్రోహం చట్టం అమలును నిలుపుదల చేయాలని ఆదేశించింది. అంతే కాదు వేర్పాటు వాదం, విభజన, సాయుధ తిరుగుబాటుకు ఉద్దేశించిన చర్యలన్నీ నల్ల చట్టం పరిధిలోకే వస్తాయి. భారత న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ 150 కింద ఏడేళ్ల నుంచి జీవితకాలం జైలు శిక్ష వేయవచ్చు. వాస్తవానికి బ్రిటిష్ కాలం నాటి నట్ల చట్టంలో ఆర్థిక కార్యకలాపాలు, వేర్పాటువాద చర్యలు అనే రెండు అంశాలు లేవు. కానీ, భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం ఆర్థిక కార్యకలాపాలు, వేర్పాటు వాద చర్యలను కూడా రాజద్రోహం కింద పరిగణిస్తారు. అంతేకాదు ఇదే చట్టానికి సంబంధించి 22వ లా కమిషన్ చేసిన సిఫార్సులను కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తు న్నాయి. అంతేకాదు శిక్షలు విధించడంలో కూడా కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిం దన్న విమర్శలున్నాయి.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో తీసుకువచ్చిన నాగరిక్ సురక్షా సంహిత్ బిల్లులో కూడా దేశద్రోహం కేసులకు సంబంధించిన వివరణ ఉంది. ఈ వివరణ ప్రకారం ఎవరైనా దేశద్రోహం జాబితా కిందకు వచ్చే చర్యలకు పాల్పడినట్లుగా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్థాయి న్యాయాధికారికి సమాచారం అందితే చాలు వెంటనే విచారణ ప్రక్రియను ప్రారంభించవచ్చు. ప్రాథమిక సాక్ష్యాధారాల అవసరమే లేదంటోంది నాగరిక్ సురక్షా సంహిత పేరుతో ఉన్న కొత్త బిల్లు. దీంతో, నల్లచట్టం కనుమరుగు అయిందన్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మాట వాస్తవం కాదంటున్నారు న్యాయరంగ నిపుణులు.