కాంగ్రెస్‌పై మాజీ సీఎం , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ తన గొంతు విప్పారు. ఒక్కసారిగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన వ్యాఖ్యలతో కేసీఆర్ నేతల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు.
తెలంగాణలో ఏ ఒక్క పథకం సరిగ్గా అమలు కావడం లేదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కైలాసం ఆడితే పెద్ద పాము మింగినట్టుగా ఉంది ప్రజల పరిస్థితి అని అన్నారు. మళ్లీ కరెంటు కోతలు వచ్చాయి.. మంచి నీళ్లకు కరువు వచ్చిందని ఆరోపించారు. ప్రజలు ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుందని ఆరోపించారాయన. ఇక లాభం లేదు, ప్రత్యక్ష పోరాటమే శరణ్యమని చెప్పారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు టెండర్లు ఎందుకు పిలవరు? వాటిని అడ్డుకోవడంలో మతలబేంటి.. అని ప్రశ్నించారు.
కరోనా వచ్చి రాష్ట్రానికి ఒక్క రూపాయం ఆదాయం రాకపోయినా రైతు బంధు ఆపలేదన్నారు. రైతులను కాపాడుకోవాలని మంచి స్కీమ్‌లు తెచ్చానని అన్నారు. రైతులు గౌరవంగా బతికారు. రైతులకు ధీమా వచ్చింది. రైతు బీమాతో ఎంతో మందికి సాయం జరిగింది. అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ముస్లింల ఓట్లను వాడుకుంది కానీ.. ముస్లింలకు ఎప్పుడైనా ఏమైనా చేసిందా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో ముస్లిం మైనార్టీ పిల్లలు, గిరిజనులకు రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టించాం. విద్యార్థులు విష ఆహారం తిని బాధపడుతున్నారని.. పిల్లలను స్కూళ్ల నుంచి తల్లిదండ్రులు తీసుకెళ్లిపోతున్నారని కేసీఆర్ అన్నారు.
“నేను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా. కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టటం నాకు ఉన్న అలవాటు. రాబోయే ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఎక్కడి ప్రాజెక్ట్ లు అక్కడే పడుకున్నాయి. సంగమేశ్వరం , బసవేశ్వరం, కాళేశ్వరం అన్ని ఎండబెడుతున్నారు.. ఇక లాభం లేదు. ప్రాజెక్టుల కోసం ప్రభుత్వంపై దండ యాత్ర చేయాలి.. అని కేసీఆర్ అన్నారు.