స్వతంత్ర వెబ్ డెస్క్: భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ ఓవైపు అల్లకల్లోలమైతే.. తనకేమీ పట్టనట్టు సీఎం కేసీఆర్ మాత్రం రాజకీయాలు చేస్తున్నారంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వరదలకు పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్ర కష్టాల్లో ఉంటే.. వాళ్లను పరామర్శించి భరోసా కల్పించాల్సిందిపోయి.. సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత కఠిన హృదయం ఉన్న సీఎంను తాను ఎప్పుడూ చూడలేదని అసహనాన్ని వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. రైతుల పట్ల కేసీఆర్ వ్యవహరిస్తోన్న నిర్లక్ష్య వైఖరిపై.. ఢిల్లీలో తెలంగాణ భవన్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం ముందు రేవంత్ రెడ్డి నిరసన వ్యక్తం చేయనున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో.. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఏఐసీసీకి చెందిన పలువురు నేతలు పాల్గొననున్నారు.
అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ వరదకు 40 మంది బలయ్యారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. వరదల వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 5 వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. రాజకీయాల కోసం ఇతర రాష్ట్రాల్లో తిరగటం కాదని.. అఖిలపక్షాన్ని తీసుకుని ఢిల్లీకి వచ్చి ప్రధాని మోదీతో పాటు హోంమంత్రిని కలిసి నిధులు విడుదల చేయమని అడగాలని సీఎం కేసీఆర్‌కు రేవంత్ సూచించారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు పార్లమెంట్‌కు వస్తున్నారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని.. పంటలు నష్టపోయిన బాధిత రైతులకు ఎకరాకు రూ. 20 వేలు ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఓవైపు.. 5 వేల కోట్ల నష్టం జరిగిందని చెప్తూనే.. మరోవైపు కేవలం 500 కోట్లు కేటాయించారని విమర్శించారు.
వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోతే.. ఈ సమయంలో కేసీఆర్ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా.. మానవత్వం ఉన్న ఏ నేత అయినా ఇలాంటి పనులు చేస్తారా? అంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సొమ్ముతో కేసీఆర్.. మహారాష్ట్రలో రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకుండా.. మహారాష్ట్రకు వెళ్లి పార్టీ ఫిరాయింపుదారులకు కండువాలు కప్పుతున్నారని మండిపడ్డారు. మరోవైపు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఆదుకోకపోతే పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని రేవంత్ చెప్పుకొచ్చారు.