చెరువుల పునరుజ్జీవనంపై చేసేందుకు హైడ్రా బృందం ఇవాళ బెంగళూరుకు వెళ్లనుంది. రెండు రోజుల పాటు బెంగళూరులో పర్యటించనుంది. చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేయనుంది బృందం. కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులోని కొన్ని చెరువులను సీఎస్ఆర్ కింద అద్భుతంగా డెవలప్ చేసింది. అక్కడి అధికారులు తీసుకున్న చర్యలను తెలుసుకుని, హైదరాబాద్‌లో అమలు చేయాలని హైడ్రా అధికారులు భావిస్తున్నారు. పాడైన చెరువులను ఎలా బాగుచేశారో అధ్యయనం చేయనున్నారు.
బెంగళూరులో చెరువులను అధ్యయనం చేసి హైదరాబాద్ పరిధిలోని బాచుపల్లిలోని ఎర్రగుంట చెరువు, మాదాపూర్‌లోని సున్నంచెరువు, కూకట్‌పల్లిలోని నల్లచెరువు, రాజేంద్రనగర్‌లోని అప్పచెరువులకు పునరుజ్జీవం కల్పించనున్నారు. అదేవిధంగా భారీ వర్షాలు పడినప్పుడల్లా హైదరాబాద్ మహా నగరాన్ని వరద నీరు ముంచెత్తడం, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు బెంగళూరు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిపుణులతో ‘హైడ్రా’ అధికారులు సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది.
బెంగళూరులో అతి తక్కువ ఖర్చుతో 35 చెరువులను బాగుచేశారు. కొన్నింటిని సీఎస్ఆర్ కింద వివిధ కంపెనీలు బాగు చేయగా, ఇంకొన్నింటిని అక్కడి ప్రభుత్వమే పునరుద్ధరించింది. చెరువుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి స్వచ్ఛమైన నీరు చేరే ఏర్పాట్లు, మురుగు కాల్వల నుంచే శుద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించింది. మూడు, నాలుగు దశల్లో నీటిని శుద్ధి చేస్తోంది.