పోలవరంలో రెండోరోజు విదేశీ నిపుణుల బృందం పర్యటించనుంది. జలవనరుల శాఖ అధికారులు, కంపెనీ ప్రతినిధులతో.. ఇవాళ విదేశీ నిపుణుల బృందం సమీక్షించనుంది. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, సీపేజీ నివారణపై తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు. సీపేజీ 80 క్యూసెక్కులు మాత్రమే ఉండడంతో.. పనులకు అంతరాయం ఉండదని కమిటీ నిర్ధారించింది. ప్రాజెక్టులోని పనుల పురోగతి, ప్రాజెక్టు యొక్క స్థితిగతులను లోతుగా అధ్యయనం చేయనున్నారు.
పోలవరం ప్రాజెక్టుపై నాలుగు రోజుల మేధోమదనంలో భాగంగా తొలిరోజు ఎగువ కాపర్ డ్యాం సీపేజీని తగ్గించి నిర్మాణ పనులు చేపట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై నిపుణులు ప్రధానంగా చర్చించారు. తొలుత ఈ బృందం ప్రాజెక్టులోని కొంత ప్రాంతాన్ని సందర్శించింది. అక్కడ ప్రస్తుతం డయాఫ్రం వాల్ నిర్మాణానికి అవసరమైన ప్లాట్‌ఫామ్ నిర్మిస్తున్నారు. మరోవైపు బంక మట్టి ఉన్న ప్రాంతాలలో పరీక్ష నిర్వహించారు. ప్రధాన డ్యామ్ ప్రాంతంలో ప్రస్తుతం కొంత డయాఫ్రమ్ వాల్ నిర్మించవలసిన చోట ఉన్న నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ పనులను వారు పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.