ఆరోగ్యమే మహాభాగ్యం. పుట్టెడు రోగాలతో మంచం పట్టిన కోటీశ్వరుడు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న పూటకు గతి లేని నిరుపేద ముందు దిగదుడుపు. దేహంలోని ప్రతి అవయవం సమర్థవంతంగా పనిచేస్తేనే మనిషి ఆరోగ్యవంతుడిగా గుర్తింపబడతాడు. శరీరంలోని ప్రతిభాగం ప్రధానమైనదే అయినా.. మూత్రపిండాలు మాత్రం చాలా గట్టి పిండాలు. జీవనశైలిలో మార్పులను కిడ్నీలు జాగ్రత్తగా పరిశీలిస్తాయి. తేడా వస్తే ప్రాణాలు తీసేస్తాయి. అవిశ్రామంగా నిరంతరాయంగా విధులు నిర్వహించే కిడ్నీలు..బుద్దిగా, చెడు అలవాట్లకు దూరంగా, సమయపాలనతో మంచి పోషకాహారం తీసుకునే వ్యక్తులంటే ప్రాణం పెట్టేస్తాయి. విందులు, మందులు అంటూ వేళాపాళ లేకుండా ఏది పడితే అదే తిని, తాగే జనాలు, నిక్షేపంలాంటి నిద్రను డ్యూటీ చెయ్యకుండా అడ్డుకునేవారు అంటే… మూత్రపిండాలకు తెగ ఒళ్లుమంట. ఈ క్యాటగిరీ పీపుల్ ఆరోగ్యాన్ని ఛిద్రం చేసేసి అన్ని విధాలా ఆ వ్యక్తులు, కుటుంబాలను పీల్చి పిప్పి చేసే వరకు కిడ్నీలు ఊరుకోవు.
మనిషి శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి. అవన్నీ సక్రమంగా పనిచేస్తేనే మానవ మనుగడ సాధ్యం అవుతుంది. జీవి మనుగడకు ఆవశ్యకరమైనది మెదడు కాగా గుండె, మూత్ర పిండాలు అతిముఖ్యమైన అవయవాలు. వీటిని మూలాధారాలుగా చెబుతారు. జీవి చేసే కార్యకలాపాలన్నింటిని మెదడు నియంత్రిస్తుందని, శరీరం మొత్తానికి రక్తాన్ని గుండె పంపింగ్ చేస్తుందనే విషయాలు మనకు తెలుసు. అయితే, రక్తాన్ని కంటికి రెప్పలా చూసుకునే పని మూత్రపిండాలు చేస్తాయి. రక్తంలో నీరు ఎక్కువైతే కిడ్నీస్ అడ్డుకట్ట వేస్తాయి. విషతుల్యాలను వడగట్టేస్తాయి.
వ్యాధుల్లో పెద్ద వ్యాధిగా రెమిడీ లేని వ్యాధిగా మూత్రపిండాల వ్యాధికి పేరుంది. దీర్ఘకాలిక మూత్ర పిండాల వ్యాధి సంక్రమిస్తే దీనికి ఎటువంటి నివారణ లేదు. అయితే, లక్షణాల నుంచి ఉపశమనం పొందడంలో, రోగి పరిస్థితి మరీదిగజారకుండా ఆపడానికి ప్రయత్నించేది చికిత్స. ఈ చికిత్స సైతం దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి దశపై ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే.. కిడ్నీలను ఆషామాషీగా తీసుకోకుండా.. ఆరోగ్యకర అలవాట్లు కలిగి ఉండడం, దురలవాట్లకు దూరంగా ఉండడం ప్రతి ఒక్కరి చేయాల్సిన ప్రధానమైన పని. మూత్రపిండాల పనితీరు మెరుగు పర్చడానికి ఎన్నో బలవర్థకరమైన ఆహారపదార్ధాలు ఉన్నాయి. తాజా పండ్లు, కూరగాయలు ఆరోగ్యరక్షణకు దోహద పడతాయి. కిడ్నీ గుడ్ ఫంక్షనింగ్ కు బెర్రీ, ద్రాక్ష, చెర్రీస్, ఆపిల్, రేగు, కాలీఫ్లవర్, ఫిష్, మీట్ మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఉల్లిపాయలు, వంకాయలు, గుడ్లు, ఉప్పు లేని సీఫుడ్ సైతం ఉత్తమమే అని చెబుతున్నారు
విశ్రాంతి అనే మాటే లేకుండా నిరంతరాయం రక్తంలో కల్మషాన్ని గాలించి, వడబోసి, శుభ్రం చేయడం మూత్రపిండాల డ్యూటీ. రక్తంలోని నీటిని, విషతుల్యాలను ఎప్పటికప్పుడు వడగడతాయి. శరీరం నుంచి వ్యర్థాలను, కణాలు ఉత్పత్తి చేసిన యాసిడ్ ను తొలగించడమే కాకుండా, ఖనిజాలు, లవణాల ఆరోగ్య సమతుల్య స్థితికి దోహదం అవుతాయి. ఒక్కరోజులో మూత్రపిండాలు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని వడకడతాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్.. ఇదో గొప్ప సామెతే. అయితే, గ్రహపాటు వల్లో, పొరపాటు వల్లో, మరే కారణం వల్లో రోగం వచ్చిపడితే చికిత్స చేసుకోక తప్పదు కదా.! మూత్ర పిండాల వ్యాధి ఎంటర్ అవుతున్నప్పుడు కొన్ని ఇండికేషన్లు ఉంటాయి. వాటిని గమనించైనా అప్రమత్తమై వైద్య చికిత్స తీసుకోవాలి.
అలసట, ఆకస్మిక బలహీనత, శ్వాస ఆడకపోవడం, మానసిక ఆందోళన, దురద, శ్వాస ఆడకపోవడం, ఆకలి లేకపోవడాన్ని ప్రధానంగా మూత్రపిండ వైఫల్య లక్షణాలుగా గుర్తించవచ్చు. ముక్కు, చిగుళ్ల నుంచి రక్తస్రావం, జ్వరం, తలనొప్పి, ఛాతి నొప్పి, గాయాలు, అతిసారం సైతం ఈ వ్యాధి సాధారణ లక్షణాలే. సాధారణస్థాయిలో కాకుండా అధికంగా లేక స్వల్పంగా మూత్ర విసర్జన పరిస్థితి ఏర్పడితే ఇది కిడ్నీ ప్రాంబ్లెంగా అనుమానించవచ్చు. కిడ్నీలో రాళ్ల నివారణకు రోజంతా పుష్కలంగా మంచినీరు తాగడం ఉత్తమ మార్గమని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ పాడైతే రక్తం వడపోత ఆగిపోతుంది. ఇది శరీరంలో ద్రవాలు, వ్యర్థాల పోగుచేయడానికి కారణం అవుతుంది.
కిడ్నీ వ్యాధి నిర్ధారణకు కంప్యూటెడ్ టోమోగ్రఫీ స్కాన్, మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్, అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. సీటీ స్కాన్, ఎంఆర్ఐ పరీక్షలను అవుట్ పేషెంట్ సెంటర్లలో దవాఖానాల్లో సుశిక్షితులైన టెక్నీషియన్లు నిర్వహిస్తారు. కిడ్నీ వ్యాధిగ్రస్థులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బరువును నియంత్రించుకోవాలి. సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. ధూమపానాన్ని విసర్జించాలి. ఉప్పు వినియోగం తగ్గించాలి. వాకింగ్, స్విమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్, గార్డెనింగ్ మూత్రపిండ వ్యాధులకు చెక్ పెడతాయి. కొవ్వు, ఉప్పు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
మూత్రపిండాలు మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేయడం ఆగిపోయినప్పుడు దానిని దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిగా భావిస్తారు. ఇది సాధారణంగా శరీరంలో అధిక రక్తపోటు కారణంగా సంభవిస్తుంది. కిడ్నీలో రక్తాన్ని శుభ్రపరిచే చిన్న రక్త నాళాలను గ్లోమెరులి అంటారు. మధుమేహం వల్ల సైతం దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి రావచ్చు. అధిక చక్కెర స్థాయిలు మూత్రపిండాలలోని రక్త నాళాలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. పరిస్థితి నిర్ధారణ అయిన తర్వాత, డాక్టర్ డయాలసిస్‌కు సలహా ఇస్తారు, ఇది రక్తం నుండి అదనపు వ్యర్థాలు, ద్రవాలను తీయడంలో సహాయపడే ప్రక్రియ. ఈ ప్రక్రియ మూత్రపిండాలు మెరుగ్గా పని చేయడంలో సహాయపడినప్పటికీ, ఇది వ్యాధిని నయం చేయదు.
మూత్ర వ్యవస్థలో చాలా సాధారణంగా ఏర్పడే ఇన్ ఫెక్షన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్పెక్షన్ వైద్య చికిత్సద్వారా సులభంగా నయం అవుతుంది. అయితే, చికిత్సలో అశ్రద్ధ చేస్తే, తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఓ దశలో మూత్ర పిండాల వైఫల్యానికి కారణం అవుతుంది. మూత్ర పిండాల వ్యాధులు ప్రారంభ దశలో ఏ లక్షణాలు చూపించవు. చివరి దశలో మాత్రమే స్పష్టంగా కన్పిస్తాయి. అందుకే..ప్రాథమిక దశలోనే కిడ్నీ వ్యాధి సింటమ్స్ గ్రహించి చికిత్సకు ఉపక్రమించాలి.
రక్తప్రవాహాన్ని, వ్యర్థ పదార్థాలు, అదనపు ద్రవాన్ని తొలగించే ప్రక్రియలో మూత్రపిండాలు విఫలం అయినప్పుడు.. దానిని కృత్రిమంగా చేపట్టే ప్రక్రియే కిడ్నీ డయాలసిస్. దాత ఆరోగ్యకర మూత్ర పిండాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించి కిడ్నీ అవసరమైన వ్యక్తి శరీరంలో ఉంచడమే కిడ్నీ మార్పిడి. మూత్రపిండ మార్పిడి తర్వాత కొత్తగా మార్పిడి చేయబడిన మూత్ర పిండాన్ని తిరస్కరించే అవకాశం ఎప్పుడైనా తలెత్తవచ్చని వైద్యులు రోగికి జీవితాంతం కొన్ని మందులు సూచిస్తారు. కిడ్నీ మార్పిడి ప్రక్రియ జరిగితే డయాలసిస్ అవసరం ఉండదు.
ప్రతి సంవత్సరం మార్చిలో అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది. మూత్ర పిండాల ప్రాముఖ్యం, కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కిడ్నీ దినోత్సవాన్ని 2006 లో ప్రారంభించారు. అంతర్జాతీయ మూత్ర పిండాల సొసైటీ, అంతర్జాతీయ ఫెడరేషన్ మూత్రపిండ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కిడ్నీ డేను నిర్వహిస్తున్నారు.
————