గ్రీన్ కో బాండ్ల వ్యవహారంలో ACB దూకుడు పెంచింది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ మాదాపూర్‌లో, మచిలీపట్నంలో ఏక కాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. గ్రీన్ కో కంపెనీతో పాటు అనుసంధాన కంపెనీలు గ్రీన్ కోర్ రేస్ డెవలపర్స్ అన్నిటిలో సోదాలు చేస్తున్నారు. పార్ములా ఈ రేసు వ్యవహారంలో గ్రీన్ కో అనుంబంధ సంస్థల ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం తెరపైకి రావడంతో ప్రస్తుతం ఈ వివాదంపై దృష్టి సారించింది. ఫార్ములా ఈ రేసు ఒప్పందానికి ముందు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్‌కు 41 కోట్లు ఇవ్వడంపై ఏసీబీ అధికారులు ఫోకస్ చేశారు.
ఎలక్టోరల్ బాండ్ల వివాదం
ఫార్ములా రేసు నిర్వహించిన గ్రీన్ కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో గ్రీన్ కో కంపెనీ రూ.49 కోట్లు చెల్లించింది. గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో చందాలు ఇచ్చారు. రేసుకు సంబంధించిన చర్చలు మొదలయినప్పటి నుండే గ్రీన్ కో సంస్థ ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
2022, 8 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రతి సారి రూ. కోటి విలువ చేసే బాండ్లు కొనుగోలు చేసింది గ్రీన్ కో కంపెనీ. మొత్తం మీద రూ. 49 కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు చెల్లించింది గ్రీన్ కో సంస్థ.
ఎలక్టోరల్ బాండ్ల వివాదంపై కేటీఆర్ మాట్లాడుతూ.. 2022లో గ్రీన్ కో సంస్థఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిందని.. 2023లో ఫార్ములా ఈ రేసు జరిగిందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీకి కూడా గ్రీన్ కో బాండ్లు ఇచ్చిందన్నారు. రేసు కారణంగా నష్టపోయింది గ్రీన్ కో కంపెనీనేనని చెప్పారు. పార్లమెంట్ ఆమోదించిన ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వడం అవినీతి ఎలా అంటారని కేటీఆర్ ప్రశ్నించారు.