Huge Rush in Tirumala| తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. వరుస సెలవులతో పాటు వారాంతపు రద్దీతో భక్తులు అధిక సంఖ్యలో శ్రీవారి దర్శనానికి తరలివచ్చారు. దీంతో అన్ని క్యూ కాంప్లెక్సులు భక్తులతో నిండిపోయాయి. దీంతో స్వామి వారి దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ ఎక్కువగా కావడంతో టీటీడీ అధికారులు భక్తులకు పలు సూచనలు చేశారు. రూ.300 ప్రత్యేక దర్శనం, దివ్య దర్శనం టోకెన్లు ఉన్నవారు మాత్రమే తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 50వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు ఆహారం అందిస్తున్నారు.


