ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్లార్ 22లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. అధికారులు వెంటనే అక్కడకి చేరుకున్నారు. పోలీసులు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది?.. అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుంభమేళాలో వరుస ప్రమాదాలు భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
రెండు రోజుల కిందట కుంభమేళాలో తొక్కిసలాట ఘటన మర్చిపోకముందే అగ్ని ప్రమాదం భక్తులను కలవరానికి గురి చేసింది. తొక్కిసలాటలో 30 మంది మృతి చెందారని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఘటనాస్థలిలో 20 మంది మరణించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 10 మంది మృతి చెందారు. మౌనీ అమావాస్య రోజున మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించాలని బారికేడ్లు తోసుకుంటూ దూసుకువచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ భావోద్వేగానికి లోనయ్యారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జ్యూడిషియల్ విచారణకు ఆదేశించారు. మృతి చెందిన కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు.
గురువారం కుంభమేళాలో జరిగిన అగ్నిప్రమాదం మూడవది. జనవరి 19న మొదటిసారి అగ్నిప్రమాదం సంభవించింది. ఆ అగ్ని ప్రమాదంలో దాదాపు 180 వరకు టెంట్లు తగలబడ్డాయి. మహాకుంభమేళా ప్రాంతంలో శాస్త్రి బ్రిడ్జి సమీపంలోని సెక్టార్-19లో గీతా ప్రెస్ క్యాంప్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. వంటగదిలో టీ చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం సంభవించింది. అనంతరం సిలిండర్లు పేలడంతో టెంట్లకు మంటలు అంటుకున్నాయి. అయితే అగ్నిప్రమాదాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.