హైదరాబాద్.. బిర్యానీకి ఫేమస్. దేశంలో హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా స్పెషల్. దేశం నలుమూలల నుంచి వచ్చే సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఇక్కడికి వచ్చే వారు బిర్యానీ టేస్ట్ చేయందే వెళ్లరు. అలాంటిది ప్రస్తుతం హైదరాబాద్ బిర్యానీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. వీటి అమ్మకాలకు బర్డ్ ఫ్లూ సెగ తగిలింది. ఫలితంగా నగరం మొత్తం చికెన్ బిర్యానీ సేల్స్ బాగా పడిపోయాయి. గత కొన్ని రోజులుగా నగరంలోని చాలా పాపులర్ రెస్టారెంట్స్‌లో చికెన్ బిర్యానీ అమ్మకాలు బాగా తగ్గిపోయాయట.
కొన్ని జాగ్రత్తలు తీసుకుని చికెన్‌ను తినొచ్చని, పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతున్నా.. వినియోగదారులు మాత్రం అతి జాగ్రత్తతో పూర్తిగా చికెన్ తినడమే మానేశారని రెస్టారెంట్ యజమానులు అంటున్నారు. దీని కారణంగా మటన్ వంటకాల అమ్మకాలు పెరగాయని, ఫలితంగా మటన్ ధరలకు రెక్కలు వచ్చాయని చెబుతున్నారు. గతంలో రెస్టారెంట్లు ప్రతిరోజూ 50-60 చికెన్ బిర్యానీ హండీలు తయారు చేయగా.. 0-15 మటన్ బిర్యానీ హండీలు మాత్రమే తయారుచేసేవారు.
చికెన్‌కు డిమాండ్ తగ్గిపోవడంతో, చికెన్ బిర్యానీ హండీలు కూడా ఒక్కసారిగా పడిపోయాయి. అదే సమయంలో మటన్ బిర్యానీ హండీల సంఖ్య రెట్టింపు అయింది. కొన్ని చోట్ల మూడు రెట్లు పెరిగిందని తెలుస్తోంది. ఇటీవల, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , మహారాష్ట్ర రాష్ట్రాల్లో H5N1 ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరిగాయి.
బర్డ్ ఫ్లూ విజృంభించడంతో .. చికెన్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి.