స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్(CM KCR) గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ఉద్యోగులకు ఉత్తమ పీఆర్సీ(PRC) ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ గోల్గొండ కోటపై(Golgonda Fort) జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఉద్యోగులకు పీఆర్సీ, సింగరేణి కార్మికులకు(Singareni workers) బోనస్(bonus) వంటి వరాలు కురిపించారు. ఉద్యోగుల సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం మిగతా రాష్ట్రాల కన్నా ముందుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యోగులే దేశంలో అత్యధిక వేతనాలు పొందుతున్నారని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఉద్యోగులకు ఇంక్రిమెంట్స్ ఇచ్చామన్నారు. ఇప్పటివరకూ రెండు సార్లు పీఆర్సీల ద్వారా 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని సీఎం తెలిపారు. కరోనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించినా ఉద్యోగులకు మెరుగైన ఫిట్‌మెంట్ అందిచామన్నారు. త్వరలోనే నూతన పీఆర్సీ నియమించి, ఉద్యోగుల వేతనాలను పెంచుతామన్నారు. అప్పటివరకూ మధ్యంతర భృతిని చెల్లిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.