సినిమా ఫక్కీలో సాగిన ఆదిభట్ల యువతి కిడ్నాప్ ఉదంతం సంచలనం సృష్టించింది. అసలు అంతమంది మనుషులను అతనెలా తీసుకు వచ్చాడు? ఆ తర్వాత ఎక్కడికి తీసుకువెళ్లాడు? మిగిలిన వాళ్లు ఎక్కడికి వెళ్లారు? యువతిని తీసుకుని వీరందరూ ఎటువైపు వెళ్లారు? కిడ్నాప్ అనంతరం అసలేం జరిగింది? మీకోసం ‘స్వతంత్ర’ ప్రత్యేక కథనం
హైదరాబాద్ లోని మన్నెగూడలో జరిగిన దంతవైద్యురాలి కిడ్నాప్ వ్యవహారంలో నవీన్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ తీసుకువచ్చారు. నవీన్ రెడ్డిపై ఆదిభట్లలో మూడు కేసులు ఉండగా, వరంగల్ లో రెండేళ్ల క్రితం ఛీటింగ్ కేసు ఒకటి నమోదైంది. పీడీ చట్టం కూడా నమోదు చేసే యోచన లో పోలీసులు ఉన్నారు. ఇప్పటికి కేసులో 36మందిని అరెస్ట్ చేశారు.
అసలు కిడ్నాప్ జరిగిన డిసెంబర్ 9న ఏం జరిగిందంటే… దంతవైద్యురాలికి నిశ్చితార్థం జరుగుతుందనే సంగతి తెలుసుకున్న నిందితుడు నవీన్ రెడ్డి తన అనుచరులకు విషయం తెలిపాడు. తన ఫ్రాంచైజీలో పనిచేస్తున్నవారందరికీ కబురు పెట్టాడు.
తను ప్రేమించిన అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారని, దానిని ఆపాలని చెప్పి వారిని తీసుకువచ్చినట్టు పోలీసులు తేల్చారు. వీళ్లు కూడా మన సినిమాల పైత్యంతో వీరోచితంగా బయలుదేరారు.
అలా నవీన్ రెడ్డి ఉదయం 11 గంటలకు మూడు కార్లు, ఒక డీసీఎంలో మన్నెగూడ చేరుకుని యువతి ఇంటికివెళ్లి హంగామా చేశాడు. అంతేకాదు యువతిని ఈడ్చుకుంటూ వెళ్లి కారులో కూర్చోబెట్టాడు. నేనుండగా మరొకరితో పెళ్లికి ఎందుకు అంగీకరించావని నుదుటిపై, వీపుపై, చేతులపై కొట్టడంతో యువతికి గాయాలయ్యాయి.
అలా కారుని నల్గొండ వైపు తీసుకువెళ్లారు. ఆ సమయంలో కారులో నవీన్ స్నేహితుడు రూమెన్ తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. అందరూ సెల్ ఫోన్లు స్విచాఫ్ చేసేయడంతో పోలీసులకు గుర్తించడం సాధ్యం కాలేదు.
మిర్యాలగూడ సమీపిస్తుండగా అందులో ఒకడు సెల్ ఫోన్ ఆన్ చేసి పోలీసులు వెతుకుతున్నారన్న విషయం గ్రహించి, యువతిని ఇంటి వద్ద సేఫ్ గా దింపేయడం మంచిదని చెప్పడంతో నవీన్ రెడ్డి అంగీకరించాడు. ఆ తర్వాత ముగ్గురు అక్కడ దిగిపోయారు.
తర్వాత నవీన్ రెడ్డి, ఒక స్నేహితుడి సహాయంతో యువతిని మన్నెగూడ పంపించాడు. తను వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు. ఆ యువతిని తీసుకుని అతని స్నేహితుడు మన్నెగూడ ఆర్టీఏ ఆఫీసు సెంటర్ కి వచ్చి, అక్కడ నుంచి యువతితో ఇంటికి ఫోన్ చేయించాడు. నేను క్షేమంగా ఫలానాచోట ఉన్నానని చెప్పించి, అతను సెల్ స్విచాఫ్ చేసి వెళ్లిపోయాడు.
తర్వాత యువతి తండ్రి హుటాహుటిన వెళ్లి ఆమెను క్షేమంగా ఇంటికి తీసుకువెళ్లారు. ఇదీ జరిగింది. ఈ కేసులో మొత్తం 36మందిని చేర్చగా ఇప్పటికి 32మందిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురి కస్టడీని కోరుతూ ఇబ్రహీంపట్నం కోర్టులో పోలీసులు పిటీషన్ దాఖలు చేశారు.