శిథిల భవనాల్లో హాస్టళ్లు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా కొన్నిచోట్ల అధికా రులు హాస్టళ్లకు సెలవలు ప్రకటిస్తున్నారు. దీంతో, విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. కర్నూల్ లో వేసవి సెలవల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. అయితే, అధ్వాన్నంగా మారిన హాస్టల్ పరిస్థితి వల్ల బడులు ప్రారంభమైన రెండు రోజులకే హాస్టల్ మూసివేశారు. అధికారులు మందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్ల విద్యార్ధులకు ఈ తిప్పలు వచ్చాయని బిసిసంఘా ల నేతలు మండిపడుతున్నారు.
కర్నూలులో 2013లో బిసి విద్యార్ధుల హాస్టల్ కోసం ఎనిమిది ప్రభుత్వ క్వార్టర్లను అద్దెకు తీసుకున్నారు. ఆర్ అండ్ బి కు చెందిన ఈ క్వార్టర్స్ లో బి.సి హాస్టల్, ఢీనోటిఫైడ్ ట్రైబ్స్ పేరిట విముక్తి జాతుల సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క క్వార్టర్ కు నెలకు రెండు వేల రూపాయల అద్దె చొప్పున ఎనిమిది క్వార్టర్లకు నెలకు 16 వేల రూపాయలు అప్పట్లో చెల్లించేవారు. తొలుత అరకొర సౌకర్యాలతో 600 మంది విద్యార్ధులకు ఈ హాస్టల్స్ లో వసతి కల్పించారు. సర్కారు నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల ఈ హాస్టళ్లల్లో వసతులు కరువయ్యాయి. దీంతో, క్రమేపీ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. చివరకు కేవలం 150 మంది విద్యార్థుల మాత్రమే మిగిలారు. మౌలిక వసతుల కల్పనలో అధికారులు అలక్ష్య వైఖరి అవలంభించడం వల్ల హాస్టల్ భవనాలు ప్రమాకరంగా మారాయి. దీంతో, ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఈ రెండు హాస్టళ్లను మూసివేశారు.
ఏపీ విద్య, మౌలిక వసతుల కల్పన సంస్థ ఇంజనీర్లు జూన్ 7 వ తేదీన ఈ రెండు హాస్టల్ భవనాల పరిస్థితులపై బీసీ సంక్షేమ అధికారులకు నివేదిక సమర్పించారు. పాఠశాల పునః ప్రారంభానికి ముందే ఇంజనీర్లు నివేదికలు సమర్పిం చినా, సంబంధిత ఉన్నతాధికారులు పాఠశాలలు తెరిచిన రెండు రోజుల అనంతరం అద్దె భవనాల కోసం ప్రకటనలు ఇచ్చారు. ఈ లోపున పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో విద్యార్థులు తిరిగి వచ్చారు. ఈ నెల 13, 14 తేదీల్లో సెలవల అనంతరం విద్యార్థులు హస్టళ్లకు చేరుకు న్నారు. ప్రమాదకరంగా ఉన్న హాస్టల్ భవనాల కారణంగా రెండు హాస్టళ్లు మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. భవనాల స్టితి గతులపై ఏపీ విద్యా, మౌలిక వసతుల కల్పన సంస్ట ఇంజనీర్లు సమర్పించిన నివేదికలో ఈ భవనాలు చాలా పురాతనమైనవని తెలిపారు. శిథిల స్థితిలో ఉన్న ఈ హాస్టల్ భవనాలు హాస్టల్స్ నిర్వహణకు పనికిరావని ఇంజనీర్లు నివేదకలో పేర్కొన్నారు. వసతుల లేమి, శిథిల భవనాల కారణం వల్ల అధికారులు రెండు హాస్టళ్లు మూసివేస్తున్నట్టు ప్రకటిం చారు. విద్యార్ధుల ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారగణం తెలిపింది. దీంతో కొందరు విద్యార్థులు చదువులు మానేస్తున్నారు, మరి కొందరు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారు. దాదాపు 140 మంది విద్యార్థులు టీసీలు తీసుకు వెళ్లినట్టు తెలిసింది. అయితే, ఈ విద్యార్థులు తమ గ్రామాల్లో పాఠశాలల్లో చేరారా, లేక చదువులు మానేశారా, బాల కార్మికు లుగా మారారా అనే విషయాలను సైతం అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఈ రెండు హాస్టళ్లు కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీ.జీ భరత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూల్ నగర కేంద్రంలో ఉండడం విశేషం.