మతవిద్వేషాలకు, మత ఘర్షణలకు దూరంగా ఉండే , గంగా జమునా తహజీబ్ అని పేరు పొందిన తెలంగాణలో ఈ సారి మత ఆధారంగా ఎన్నికల్లో గెలవాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోందా ? గత జీహెచ్ ఎంసీ ఎన్నికల మాదిరిగా మత ఆధారిత నినాదాలతో ముందుకు పోతున్న బీజేపీ తెలంగాణలో విజయం సాధించగలదా ?
తాము మళ్ళీ అధికారంలోకి వస్తే తెలంగాణలో మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్న మాటల్లో ఓటర్లలో మత పరమైన చీలిక తేవాలన్న ఆలోచన ఉన్నదన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో జీహెచ్ ఎంసీ ఎన్నికలప్పుడు కానీ, అప్పటి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రలో కానీ ఆయన చేసిన మతపరమైన ఉపన్యాసాలపై అనేక విమర్శలు వచ్చాయి. ”మసీదులన్నీ తవ్వుదాం శవమొస్తే మీకు, శివుడొస్తే మాకు” అని రెచ్చ గొట్టే ఉపన్యాసాలు మళ్ళీ ఇప్పుడు మొదలవుతాయా అనే అనుమానాలు అమిత్ షా వ్యాఖ్యలతో బలపడుతున్నాయి.
కొంత కాలంగా రాష్ట్రంలో బీజేపీ ఉత్తరాది ప్రణాళికలను అమలు చేస్తున్నది. ముఖ్యంగా బండి సంజయ్ అధ్యక్షుడుగా ఉన్నంత కాలం ఆయన ఒక మతానికి చెందిన ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నాడని అటు బీఆరెస్, ఇటు కాంగ్రెస్ లు తీవ్ర ఆరోపణలు చేశాయి. అయితే నాలుగు ఎంపీ సీట్లు గెలవడానికి గానీ హైదరాబాద్ జీహెచ్ ఎంసీలో 48 కార్పోరేటర్లను గెలిపించుకోవడానికి గానీ అటువంటి మతపరమైన ప్రచారమే పనిచేసిందని పలువురు బీజేపీ నాయకుల నమ్మకం. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అటువంటి ప్రచారాన్ని తెలంగాణ ఓటర్లు తేలిగ్గా తీసుకున్నారు. మతపరమైన ఎమోషన్స్ ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ ప్రజలు బీజేపీ వైపు చూడలేదు. మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో 8 సీట్లు మాత్రమే బీజేపీ గెలిచింది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా దూకుడుగా ఉండే బండి సంజయ్ ని తప్పించి సౌమ్యుడైన కిషన్ రెడ్డి నియమించడమే ఓటమికి కారణమని బండి సంజయ్ వర్గం ప్రచారం చేస్తున్నది. అయితే అందులో నిజం లేదని రెచ్చగొట్టే, మత ప్రాతిపదికన జరిగే ప్రచారానికి కొంత మంది యువకులు ఆకర్షితమవుతారు కానీ తెలంగాణలోని మెజార్టీ ప్రజలు తమ సమస్యలు, చుట్టూ ఉండే పరిస్థితుల ఆధారంగానే ఓట్లేస్తారని విశ్లేషకులు అంటున్నారు. ఈ సారి మళ్ళీ మైనార్టీలకు వ్యతిరేకంగా అమిత్ షా ప్రారంభించిన ప్రచారం, రేపు స్థానిక బీజేపీ నాయకులు ముమ్మరం చేసినా తెలంగాణ ప్రజలు మాత్రం ఆ ప్రచారానికి లోనుకాక పోవచ్చని పరిశీలకుల అంచనా. యువత మాత్రం కొంత మేర బీజేపీ నాయకుల ప్రచారానికి అట్రాక్ట్ అవుతున్నది. యువకుల్లో రోజు రోజుకు బీజేపీ పరపతి పెరుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసినవారు కూడా పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి వేస్తారనే ప్రచారాన్ని బీజేపీ తీవ్రంగానే చేస్తున్నది. ఈ ప్రచారాన్ని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆరెస్ ఎలా ఎదుర్కొంటాయన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.