ప్రకాశం జిల్లా ఒంగోలులో అర్ధరాత్రి టెన్షన్పై మాటల యుద్ధం జరుగుతోంది. గొడవలకు మీరంటే మీరే కారణమంటూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు టీడీపీ, వైసీపీ నేతలు. సమతా నగర్ లో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి తరఫున ఆయన కోడలు కావ్య రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ అపార్ట్ మెంట్ లోని మహిళలు ఆమెను అడ్డుకున్నారు. బాలినేని కోడలితో అపార్ట్ మెంట్ వద్ద మహిళలు గొడవకు దిగటంతో వైసీపీ, టీడీపీ కార్యకర్త లకు మాటామాటా పెరిగి ఇరుపార్టీల శ్రేణులు ఘర్షణకు దిగారు. ఇరువర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవటంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. ఘర్షణలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యా యి. దీంతో ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ, టీడీపీ పార్టీల మద్య ఉద్రిక్తతలు చోటు చేసుకోవ టంతో ఇరుపార్టీల ప్రధాన నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్వయంగా రంగం లోకి దిగటంతో పరిస్దితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఒంగోలు సమతా నగర్ లో మొదలైన గొడవ కాస్తా రిమ్స్ చేరుకోవటంతో దాదాపు అర్దరాత్రి సమయంలో రెండు గంటల పాటు హైటెన్షన్ నెలకొంది.ఘర్షణలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తను టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరామ ర్శించారు. టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని దామచర్ల జనార్దన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డ వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేయాలంటూ ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులరెడ్డి, అసెంబ్లీ అభ్యర్ధి దామచర్ల జనార్దన్ లు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకుంటే విషయాన్ని ఎలక్షన్ కమీషన్ దృష్టికి తీసుకు వెళ్తామన్నారు..
ఒంగోలు సమతా నగర్ లో దాడి ఘటన జరగిన స్థలానికి మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్లారు.. దాడలో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలను పరామర్శించారు. తమ కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించటంతోనే ఘటన జరిగిందన్నారు బాలినేని.. గతంలో ఎన్నికల ముందు ఒంగోలు లోని కమ్మపాలెంలో ప్రచారానికి వెళ్లిన తమను అప్పుడు కూడా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో పాటు తమపై తప్పుడు కేసులు కూడా పెట్టారన్నారు.
ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు బాలినేని, దామచర్లలు అక్కడకు వెళ్లారు. వారిద్దరితో పాటు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకేసారి చేరుకోవ డంతో రిమ్స్ ప్రాంగణం నినాదాలతో హోరెత్తింది. టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు అనుమతి ఇచ్చిన పోలీసులు దామరచర్ల లోపల ఉండటంతో బాలినేనిని బయట నిలిపి వేయటంతో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది.. క్యాజువాలిటీలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల తోపులాటలో పలు అద్దాలు ధ్వంస మయ్యాయి. రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేయటంతో అక్కడి రోగులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో పరిస్దితిని అదుపు చేసేందుకు అక్కడ కు సీఆర్పీఎఫ్ సహా అదనపు బలగాలను తెప్పించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే అర్ధరాత్రి సమయంలో దాదాపు రెండు గంటలపాటు బాలినేని, దామచర్ల అక్కడే ఉండటంతో హైడ్రామా నెలకొంది. పోలీసులు బాలినేని, దామచర్లను సర్దిచెప్పి పంపటంతో వివాదం తాత్కాలికంగా సద్దు మణిగింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటువంటి గొడవలు జరగటం నగరవాసులకు ఆందోళన కలిగి స్తుంది. ఒంగోలులో గొడవపై స్పందించిన సజ్జల.. టీడీపీ నేతలే గొడవలు సృష్టించి నిందలు తమ మీద వేస్తున్నారని సజ్జల ఫైరయ్యారు.


