జమ్మూకశ్మీర్‌లో వరుసగా ఉగ్ర దాడులు కలవరపెడుతున్నాయి. వీటిని భారత సైన్యం దీటుగా ఎదుర్కొంటున్నప్పటికీ.. ప్రతిఘటనలో సైన్యంతో పాటు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో భద్రతకు సంబంధించిన కేబినెట్ కమిటీతో ప్రధాని మోదీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హోం మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరైనట్లు తెలుస్తోంది. దోడా జిల్లాలో తాజా ఉగ్ర కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడిన కొన్ని గంటల్లోనే ప్రధాని అధ్యక్షతన ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
జమ్మూకశ్మీర్‌లో సరిహద్దు జిల్లాలైన కఠువా, దోడాలో పలు ప్రాంతాలు వరుస దాడులతో ఉలిక్కి పడుతున్నాయి. గత 32 నెలల్లో జరిగిన దాడుల్లో దాదాపు 50 మంది భద్రతా సిబ్బంది సహా సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నాలుగు నెలల్లోనే ఐదు భారీ ఉగ్రదాడులు జరిగాయి. ఇటీవల జరిగిన దాడుల్లో ఆర్మీ కెప్టెన్‌తో సహా 12 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. మరో 10మంది సామాన్యులు చనిపోగా.. 55 మంది గాయపడ్డారు. సరిహద్దు జిల్లాల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్‌లతో వారిని మట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.