స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ హైకోర్టు(High Court) న్యాయమూర్తులు జస్టిస్ చిల్లకూరు సుమలతను(Justice Chillakuru Sumalatha) కర్ణాటక, జస్టిస్ ముమ్మినేని సుధీర్‌కుమార్ (Justice Mummineni Sudhir Kumar)ను మద్రాస్ హైకోర్టు(Madras High Court)లకు బదిలీచేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 10న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్(Arjunram Meghwal) సోమవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.
రాజ్యాంగం కల్పించిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Draupadi Murmu) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి ఈ న్యాయమూర్తులను బదిలీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వీరితోపాటు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వివేక్‌కుమార్ సింగ్‌ను మద్రాస్, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శేఖర్ బి.షరాఫ్(Justice Shekhar B. Sharaf)ను అలహాబాద్, జస్టిస్ బిబేక్ చౌధురీని పట్నా హైకోర్టులకు బదిలీచేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
జస్టిస్ చిల్లకూరు సుమలత(Justice Chillakuru Sumalatha) 2021 అక్టోబరు 15న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007లో తొలుత ఆమె జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా, హైదరాబాద్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా సేవలందించారు.
జస్టిస్ ముమ్మినేని సుధీర్‌కుమార్ (Justice Mummineni Sudhir Kumar)2022 మార్చి 24న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 1994 డిసెంబరు 21న న్యాయవాదిగా వృత్తిజీవితం ప్రారంభించిన ఆయన కేఎల్ యూనివర్సిటీ, విజ్ఞానజ్యోతి సొసైటీ నిర్వహించే విద్యాసంస్థలు, పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు లీగల్ అడ్వయిజర్‌గా పనిచేశారు. హైకోర్టు, సిటీ సివిల్ కోర్టులు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కోర్టులు, ఫ్యామిలీ కోర్టుల్లో న్యాయవాదిగా కేసులు వాదించారు. జస్టిస్ సుధీర్‌కుమార్ స్వస్థలం కొత్తగూడెం.