స్వతంత్ర వెబ్ డెస్క్: తమిళనాడు శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎండ వేడి నుంచి వర్షాలు ప్రజలకు ఉపశమనం కల్పించినప్పటికీ.. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండర్‌పాస్‌ల్లోకి నీరు చేరి వాహనాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈదరుగాలులకు చెట్లు నేలకూలాయి. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్, చెంగల్పట్లు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దీంతో పాఠశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
చెన్నైలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 102మి.మీల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. చెన్నైతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు జూన్ 21 వరకు కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అటు వర్షం కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపైకి నీరు చేరింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఉదయం చెన్నైకు వచ్చే 10 విమానాలను బెంగళూరుకు దారిమళ్లించారు. వర్షాల కారణంగా డజనుకు పైగా అంతర్జాతీయ విమానాలు బయలుదేరడం ఆలస్యమైంది.


