స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం రాత్రి భారీ వర్షాలు పడ్డాయి. ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆగకుండా పడ్డ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన రోడ్లన్ని కలువలుగా మారిపోయాయి. తెలంగాణ లో అత్యధికంగా జనగామ జిల్లాలో 12.3 సెంటీమీటర్ల వర్షం కురువగా హైదరాబాద్ లో ఎక్కువగా షేక్ పేటలో 10.6 సెంటి మీటర్ల వర్షం పడింది. షేక్ పేటలోని నదీమ్ కాలనీలో భారీగా నిలిచిన వరద నీటితో స్థానికుల ఇబ్బందులు పడుతున్నారు. గచ్చిబౌలిలోని కురిసిన వర్షానికి డిఎల్ఎఫ్-టీసీఎస్ వద్ద భారీగా వరదనీరు నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కూకట్ పల్లి బ్రిడ్జి కింద భారీగా వరద నీరు నిలచిపోయింది.
గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా ఎండా కాలంలో ఈ స్థాయి వర్షం పడటం చాలా అరుదని అధికారులు చెప్పారు. ఉపరితల ద్రోణి, గాలిలోని అనిశ్చితి కారణంగా ఎండాకాలంలో వానలు పడుతున్నాయని. మరో మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో జీ హెచ్ ఎం సీ అలర్ట్ ప్రకటించింది. ఇక బల్దియా యంత్రాంగం అప్రమత్తం ఉండాలంటూ మేయర్ విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. జోనల్ కమిషనర్ లతో మేయర్ విజయలక్ష్మి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.