స్వతంత్ర వెబ్ డెస్క్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తున్నది. దీంతో కుమ్రం భీం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తడంతో పెద్దవాగులో వరద ప్రవాహం పెరిగింది. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మండలాల్లోని పెద్దవాగు తీర పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా, సిర్పూర్.టీ మండలం వెంకటాపురం వద్ద ప్రాణహితలో వరద ప్రవాహం పెరిగింది.
పారిగాం వద్ద ప్రాణహిత బ్యాక్ వాటర్ రోడ్డుపైకి వస్తున్నది. సలుగుపల్లి వద్ద సుస్మీర్ తీగల ఒర్రె ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి. చింతలమానేపల్లి మండలంలోని దిందా, రణవెళ్లి, నాయకపు గూడ, శివపెళ్లిలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దహేగాం మండలంలో ఉచ్చమల్ల వాగు, పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
వరంగల్ జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. వర్షం కారణంగా పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షంతో ఆకేరు వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నది. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంతిని ఊర చెరువు 5 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్నది. దీంతో వరంగల్-ఖమ్మం రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.