తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు కుండపోత వానలు కురవనున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినం మరింత బలపడనుంది. దీంతో తెలంగాణ, ఏపీలో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. తీవ్ర అల్పపీడనం తీరం దాటిన అనంతరం మరింత బలపడి.. తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వైపు ప్రయాణించి సెప్టెంబర్ 2 నాటికి వాయుగుండంగా మారే అవకాశముందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీర ప్రాంతంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని… మత్స్యకారులెవరూ వేటకు వెళ్లరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
తెలంగాణలోనూ జోరు వానలు దంచి కొడుతాయని తెలిపింది వాతావరణశాఖ. రాష్ట్రంలో దాదాపు 11 జిల్లాల్లో మూడు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. వర్ష ప్రభావం ఉన్న జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ మంచిర్యాల, జగిత్యాల, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స ఉందని.. రేపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండలో కుండపోత వానలు కురుస్తాయని.. అలాగే ఎల్లుండి నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, కామారెడ్డిలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేసింది.
మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గుజరాత్‌పై వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మంగళవారం నుంచి కుండ పోత వానలు కురిపిస్తున్నాడు. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. గుజరాత్‌లోని కచ్, దేవభూమి ద్వారకా, జామ్ నగర్ జిల్లాల్లో ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.