మదనపల్లె ఫైల్స్, రుషికొండ భవనాల అంశాలపై ఏపీ శాసనమండలిలో వాడీ వేడి చర్చ జరిగింది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. మదనపల్లె దస్త్రాల కేసులో త్వరలోనే అన్ని వివరాలు బయటకు వస్తాయని ప్రభుత్వం చెబితే.. రుషికొండపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని తేల్చిచెప్పింది విపక్ష వైసీపీ. ఇక, ఉద్యోగుల బదిలీలపై ఏపీ అసెంబ్లీలో ముఖ్యమైన ప్రకటన చేశారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వివిధ అంశాలపై నువ్వా-నేనా అన్నట్లుగా తలపడ్డాయి అధికార, విపక్షాలు. ప్రధానంగా మదనపల్లె ఫైల్స్ దహనం, రుషికొండ భవనాల అంశాలపై చర్చ వాడీవేడీగా సాగింది. కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీగా మారిన చర్చలో అనేక ముఖ్యమైన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. మదనపల్లె ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం తరఫున స్పెషల్ సీఎస్ వెళ్లారని.. అప్పుడు ఎంతో మంది ఫిర్యాదులు చేశారన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీఐడీ ఎంక్వైరీ జరుగుతోందని చెప్పిన ఆయన..తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
మదనపల్లె ఫైల్స్ దహనం కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. దస్త్రాల దహనం వెనుక కుట్ర ఉందంటూ శాసనమండలిలో టీడీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారాయన. ఈ క్రమంలోనే మంత్రి అనగాని… మాజీ మంత్రి పేరు ప్రస్తావించడంతో వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే..సీఐడీ దర్యాప్తులో ఉన్న అంశాల్నే తాను ప్రస్తావించానని అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. మదనపల్లె ఘటనపై పారదర్శకంగా విచారణ జరగాలన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఏ కేసులోనైనా విచారణ అనంతరమే పేర్లను బయటకు చెప్పాలని సూచించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అని చెబుతున్నారని ఇది సరికాదన్నారు. తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్సీ బొత్స.
విశాఖలో ఉన్న రుషికొండ భవనాల అంశంపైనా మండలిలో హాట్‌హాట్ చర్చ సాగింది. రుషికొండపై ఎంత ఖర్చు పెట్టారో అందరికీ తెలుసన్నారు మంత్రి కందుల దుర్గేశ్. ఆదాయం ఎక్కువ ఇచ్చిన హరిత రిసార్ట్స్‌ను పక్కన పెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టారని ఆరోపించారు. సీఎం నివాసం కోసం అంటూ చివరలో చెప్పారన్నారు మంత్రి దుర్గేశ్. కళ్ల ముందు ఇంత డబ్బు దోపిడీ జరిగితే చూస్తూ ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు మంత్రి అచ్చెన్నాయుడు. రుషికొండ నిర్మాణాలు చూస్తే ఎవరూ ఇలా మాట్లాడరన్నారు. ముందుగా చెప్పింది ఒకటన్న ఆయన.. ఆ తర్వాత దాన్ని మార్చి చూపించారని ఫైరయ్యారు. అందర్నీ తీసుకెళ్లి రుషికొండ నిర్మాణాలు చూపిస్తే ఇంకెవరూ మాట్లాడరన్నారు అచ్చెన్నాయుడు.
రుషికొండలో కట్టినవన్నీ ప్రభుత్వ భవనాలన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఆ బిల్డింగ్‌లను బాగా కట్టారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అవన్నీ ప్రభుత్వ భవనాలని అన్న ఆయన.. జగన్ సొంత భవనాలు కాదని చెప్పుకొచ్చారు. ఏదైనా లోపం జరిగిందని భావిస్తే విచారించుకోవచ్చని సూచించారు బొత్స. ఏపీ, తెలంగాణ మధ్య ఉద్యోగుల బదిలీలపై ముఖ్యమైన ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 19వందల 42 మంది ఉద్యోగులు ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లేందుకు ఆసక్తిచూపుతున్నారని ప్రకటించారు. ఇదే సమయంలో 14 వందల 47 మంది తెలంగాణ నుంచి ఏపీకి రావాలనుకుంటున్నారని అన్నారు. ఉద్యోగుల వన్‌టైమ్ రిలీవ్ కోసం తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు మంత్రి. తెలంగాణ సర్కారు నుంచి సమాధానం రావాల్సి ఉందన్నారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. మొత్తంగా ఏపీ శాసనమండలిలో వివిధ అంశాలపై నువ్వా-నేనా అన్నట్లుగా పోటీపడ్డాయి అధికార, విపక్షాలు.