దేశవ్యాప్తంగా భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనాలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. మరో వారంరోజుల పాటు దేశంలో ఎండలు మండిపోనున్నాయని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది.
ఎండతీవ్రతతో పాటు వేడిగాలులు ఎక్కువగా వీస్తాయని తెలిపింది. గరిష్టంగా 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, సిక్కిం, ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వేడిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పింది.
ఏపీలోని దక్షిణ, ఉత్తర కోస్తా ప్రాంతాలైన హీట్ వేవ్ హెచ్చరికలను జారీ చేసింది. అలాగే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా 38 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది.