అసెంబ్లీ ఎన్నికల ముందు జనసేన పార్టీలో కొత్త అలజడి రేగుతోందా..? పవన్ వరుసగా త్యాగాలు చేస్తుండడం జనసైనికులకు నచ్చడం లేదా..? 24 సీట్లలో మళ్లీ మూడు సీట్లు కోత పడడంపై జనసేన కేడర్ గుర్రుగా ఉందా..? అసలు జనసేన మాత్రమే తగ్గడం వెనుక అసలు కారణం ఏంటి..? ఇంతకీ జనసేనకు పొత్తు, ప్లస్సా..? మైనస్సా..?
ఏపీలో రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు ఊహకందని విధంగా ఉంటున్నాయి. ఒకప్పుడు సీఎం పీఠంపై కూర్చునేది తానే అని గట్టిగా చెప్పిన పవన్..ఆ తర్వాత రాష్ట్ర భవిష్యత్ కోసమే పొత్తులు కుదుర్చుకున్నామని తెగేసి చెప్పారు. ఇందులో భాగంగానే పొత్తులు కుదరడంతో పవన్ సీఎం పీఠంపై జనసైనికుల ఆశలు నీరుగారాయి. అయితే కనీసం పొత్తులో భాగంగా గౌరవప్రదమైన సీట్లు సాధిస్తామని జనసైనికులు భావించారు. తీరా చూస్తే అక్కడా వారికి నైరాశ్యమే మిగిలింది. జనసే కేవలం 21 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. జనసేనకు 24 సీట్లు ఇచ్చినవే తక్కువ అనుకుంటే అందులో కూడా మూడు కోత పెట్టడమేంటి అన్న చర్చ ఆ పార్టీలో జోరుగా జరుగుతోంది. ఇదే ఇప్పుడు పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారింది. ఇది ఏపీ రాజకీయాలను కీలక మలుపు తిప్పే వ్యవహారం అవుతుందా అన్న చర్చ సైతం జరుగుతోంది.
వాస్తవానికి గత ఏడాది పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలు పెట్టినప్పుడు జనసైనికుల్లో ఫుల్ జోష్ కనపడింది. మీడియా అటెన్షన్ అంతా పవన్ వైపే ఉండేది. వారాహి యాత్రలో పవన్ కూడా వైసీపీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వంలో అవినీతి పరుల అంతు చూస్తానని శపథం చేశారు. జగన్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రతినబూనారు. ఇదే సమయంలో ప్రజలు కోరుకుంటే సీఎం పీఠంపై కూర్చునేందుకు సిద్ధమని ప్రకటించారు. అప్పట్లో పవన్ చేసిన ప్రకటనతో జనసైనికుల్లో ఉత్సాహం ఉరకలేసింది. పవన్ కనపడితే చాలు సీఎం నినాదాలు హోరెత్తేవి. కానీ ఏపీలో పొత్తు ఫిక్స్ అవడంతో పవన్ స్వరం స్లోగా మారింది.
ఇక ఏపీలో పొత్తులు ఫిక్స్ అవడంతో జనసేనకు 65 స్థానాలు ఇస్తారనే అంచనాలు ఉండేవి. ఇటు పవన్ అభిమానులు కానీ.. అటుకాపు సామాజిక వర్గం కానీ ఇదే తరహా ఆలోచనతో ఉండేవి. ఏ మాత్రం తగ్గొద్దన్న సూచనలు, సలహాలు పవన్‌కు కూడా వచ్చాయి. అయితే ప్రభుత్వ ఓటు చీలకూడదని..రాష్ట్ర భవిష్యత్త్ కోసం ఎంతైనా తగ్గుతామని పవన్ చెప్పకొచ్చారు. మొత్తానికి సుదీర్ఘ చర్చల తర్వాత జనసేనకు 24 సీట్లు ఖరారయ్యాయి. అయితే జనసేనకు ఇన్ని తక్కువ సీట్లు ఎలా ప్రకటిస్తారని జనసైనికులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అయితే సీట్లు ముఖ్యం కాదని..24 మందిని అసెంబ్లీకి తీసుకెళ్లడమే లక్ష్యమని పవన్ పార్టీ కేడర్‌కు నచ్చచెప్పారు.
మరోవైపు ఇదే సమయంలో పొత్తు సీన్‌లోకి బీజేపీ ఎంటర్ అవడంతో మళ్లీ జనసేనే తగ్గాల్సి వచ్చింది. 24 నెంబర్‌ను ఫిక్స్ అయిన జనసైనికులకు మళ్లీ షాక్ తగిలింది. డబుల్ డిజిట్ సీట్లు కావాలని బీజేపీ పట్టుపట్టడంతో 3 స్థానాలను జనసేన త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతో మళ్లీ తీవ్ర నిరాశలో మునిగిపోయారు జనసైనికులు. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయవర్గాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది. అసలే గాయం తగిలి మంటపడుతుంటే.. దాని మీద కారం పూసినట్టుగా ప్రస్తుత పరిణామాలు మారిపోయాయన్న భావన ఆ పార్టీ కేడర్‌లో వ్యక్తమవుతోందనే చర్చ జరుగుతోంది. మొత్తానికి పవన్ అంతరంగం జనసైనికులకు అంతుబట్టడం లేదనే చర్చ జరుగుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ మరోసారి జగన్‌ను సీఎం కానివ్వనని శపథం చేసిన పవన్..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తున్నారని అంటున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతోందో చూడాలి.


