మనకెందుకులే అన్నీ సీఎం చూసుకుంటారని మంత్రులు అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికీ, ఆయన మంత్రివర్గ సహచరులకూ మధ్య దూరం పెరిగిందా? విపక్షాలు రోజురోజుకూ ప్రభుత్వంపై మాటల దాడి పెంచుతున్నా అమాత్యులు ఎక్కువ శాతం ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు? ఇంకా చెప్పాలంటే విపక్షాల మాదిరిగానే స్వపక్షానికీ రేవంత్ టార్గెట్ అయ్యారా? అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది?
ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ రెండూ కలిసి రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విపక్షాల విమర్శలకు కౌంటర్ అటాక్ ఇవ్వడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందనే విమర్శలు ఇప్పుడు గట్టిగా విన్పిస్తున్నాయి. ఓవైపు పార్టీ నేతలు, మరోవైపు ప్రభుత్వ మంత్రులు ఇలా రెండు వర్గాలు కూడా ప్రతి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి పైనే వదిలేస్తున్నట్లు విశ్లేషకులు సైతం అభిప్రాయపడు తున్నారు. పాలన విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇచ్చే విషయంలో అటు కాంగ్రెస్ పార్టీ తరఫునా, ఇటు ప్రభుత్వం తరఫునా ముఖ్యమంత్రికి మద్దతుగా నిలబడే వారు, ఆయన తరఫున తమ వాయిస్‌ను వినిపించేవారు ఎవరో ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది లేరన్న వాదన రాజకీయ వర్గాల్లో బలంగా విన్పిస్తోంది. ప్రభుత్వ పాలనపై ప్రతి రోజూ బీజేపీ, బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. అయితే, వీటికి చెక్ పెట్టడంలో ఇటు మంత్రులు గానీ, అటు పార్టీలోని కీలక నేతలు కానీ కనీసం కౌంటర్ ఇవ్వడంలోనూ ఇబ్బంది పడుతు న్నట్లు కనిపిస్తోందన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు కాకముందే ఇలాంటి పరిస్థితి ఉంటే భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందని క్షేత్ర స్థాయిలోని నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఎక్కడిదాకో ఎందుకు తమ శాఖలకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా మంత్రు లు మాత్రం తమకేమీ సంబంధం లేనట్టుగా సైలెంట్ గానే ఉంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే మొన్నటి లోక్ సభ ఎన్నికల ప్రచారంలోనూ ఇది స్పష్టంగా కనిపించిందని గాంధీ భవన్‌లోనే ప్రచారం సాగుతోంది. అమిత్ షా ఫేక్ వీడియో విషయంలో పార్టీ చీఫ్, ప్రభుత్వ చీఫ్ గా ఉన్న రేవంత్ కు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చినా. ఒకరిద్దరు మంత్రులు మినహా మిగిలిన వారెవ్వరూ కనీసం స్పందించలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై బీజేపీ, బీఆర్ఎస్ కలిసి మాటల దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా కరెంట్, రుణమాఫీ, రైతుబందు, ఎరువులు, ధాన్యం కొనుగోలు, నిరుద్యోగ భృతి, పంట బోనస్ తదితర అంశాలపై ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటు మీడియా సమావేశాలు, పబ్లిక్ మీటింగ్స్ తో పాటు అటు సోషల్ మీడియాలో సైతం ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. ఇక, ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని, రేవంత్ పార్టీ మారితారని ప్రతిపక్షాలు విపరీతంగా ప్రచారం చేస్తున్నా మంత్రులు, సీనియర్ నేతలు ఆయా విమర్శలకు దీటుగా స్పందించకపోవడంపై పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తిగా ఉన్నారు.
ఇక, మంత్రిత్వ శాఖలపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వేల కోట్ల అవినీతి ఆరోపణలు చేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. రేవంత్ టాక్స్, భట్టి టాక్స్, ఉత్తం టాక్స్ అని వరుస ప్రెస్ మీట్లతో కారు, కాషాయ నేతలు హోరెత్తిస్తు న్నారు. అయినా మంత్రులు కనీసంగానైనా మారు మాట్లాడటం లేదన్న విమర్శలున్నాయి. కరెంటు కోతలు, రైతుల సమస్యలు, ధాన్యం కోనుగోళ్లు, విత్తనాల కొరత ప్రభుత్వ ఆసుపత్రుల్లో పవర్ కట్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నా, ఆయా శాఖల మంత్రుల నుంచి కనీస స్పందన లేదన్న మాట గత కొద్ది రోజుల నుంచీ విన్పిస్తోంది. దీంతో విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎంతో కొంత నిజం లేకపోలే దన్న పరిస్థితి ప్రజల్లో మెల్లమెల్లగా వస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ కలిసి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నా, మాకేంటి అన్నట్లుగా మంత్రుల వ్యవహార శైలి మారిందన్న మాట కాంగ్రెస్ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది.
బీజేపీ, బీఆర్ఎస్‌పై ఎదురుదాడి చేయడంలో వెనకడుగు వేస్తే డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని కాంగ్రెస్ పార్టీలో సీరియస్ చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అయితే..తాము మద్దతిస్తే రేవంత్ క్రేజ్ పెరుగుతుందని కొందరు నేతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే అన్ని విమర్శలకూ ముఖ్య మంత్రి రేవంతే కౌంటర్ ఇచ్చుకుంటారని, మనకెం దుకు తలనొప్పి అన్న ధోరణితో కొందరు మంత్రు లున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇవన్నీ కలిసి సీఎంకు తలపోటు మాదిరిగా తయారైందన్న వాదన విన్పిస్తోంది. అయితే, మంత్రి వర్గ సహచరులు తనను ఒంటరిని చేస్తున్నారని ఇప్పటికే కొందరు సన్నిహి తుల వద్ద ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు ప్రచారం సాగుతోంది. అయినా అమాత్యుల్లో మార్పులేదని చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లోనైనా ఈ పరిస్థితి మారుతుందా.. అమాత్యులు సీఎంకు అండగా నిలుస్తారా..విపక్షాల నుంచి దూసుకొచ్చే విమర్శలకు దీటైన సమాధానాలు ఇస్తారా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది.


