స్వతంత్ర వెబ్ డెస్క్: భారత మహిళల క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. అంతా ఊహించినట్లుగానే రెండు మ్యాచ్‌లు ఆడకుండా ఆమెపై నిషేధం విధించింది. ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. బంగ్లాదేశ్‌తో ఇటీవల ముగిసిన మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఎల్బీడబ్ల్యూ విషయంలో అంపైర్ తప్పుడు నిర్ణయం ప్రకటించారని తీవ్ర ఆగ్రహానికి గురైన హర్మన్‌ప్రీత్ కౌర్.. తన బ్యాట్‌తో వికెట్లను బలంగా కొట్టింది. అంతటితో ఆగకుండా క్రీజును వీడే సమయంలో అంపైర్‌ను బండ బూతులు తిట్టింది. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్‌లోనూ అంపైర్లు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపణలు గుప్పించింది. మరోసారి బంగ్లాదేశ్‌కు వచ్చినప్పుడు అంపైర్లతో ఎలా వ్యవహరించాలో కూడా నేర్చుకొని వస్తామని వ్యంగ్యస్త్రాలు సంధించింది. ఈ రెండు ఘటనలను సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ భారీ జరిమానాతో పాటు రెండు మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది.
అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ వికెట్లను బ్యాట్ కొట్టిన ఘటనను లెవల్ 2 తప్పిదంగా పరిగణించిన ఐసీసీ.. హర్మన్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు మూడు డీమెరిట్ పాయింట్స్ విధించింది. ఇక అంపైర్ల నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించడాన్ని లెవల్ 1 తప్పిదంగా పరిగణించిన ఐసీసీ మరో 25 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది.