తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీంతో ప్రధాన ఆలయాలన్నీ హనుమాన్ భక్తులతో కిక్కిరిసిపోయాయి. జై హనుమాన్ నామస్మరణతో మారుమోగుతు న్నాయి. వేడుకల్లో భాగంగా అనంతపురం జిల్లాలోని కసాపురం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తోమాల సేవ, వివిధ పుష్పాలంకరణతో పాటు వజ్ర కవచ అలంకరణ చేసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీతోపాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుండి వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పా ట్లు చేశారు.
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోనూ హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. దీంతో రాజన్న ఆలయం కాషాయమయమైంది. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన హనుమాన్ దీక్షాదారులతో ఆలయం కిక్కిరిపోయింది. జై హనుమాన్ నామస్మరణతో మారుమోగింది. వేకువజాము నుంచే భక్తులు ఆలయ ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించి పార్వతిపరమేశ్వరుల ను దర్శించుకున్నారు. అనంతరం కోడెమొక్కులు చెల్లించుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. హౌసింగ్ బోర్డ్ లోని అభయ ఆంజనేయస్వామి ఆలయంలో జరుగుతున్న వేడుకలను కనులారా తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది. వేడుక సందర్భంగా 100 మంది యువలకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోనూ హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. కంచికచర్ల మండలం పరిటాలలో ఉన్న 135 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇందుకోసం తెల్లవారు జాము నుంచే భక్తులు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు.


