ప్రజలకు ప్రస్తుతం మీ సేవా ద్వారా ఆన్ లైన్‌లో అందిస్తున్న సేవలకు అదనంగా మరిన్ని సేవలను తీసుకొస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తామని, దీనిపై ఎవరూ సందేహపడనవసరం లేదని శ్రీధర్ బాబు అన్నారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం వెనకడుగు వేయదని, ఒకదాని తర్వాత ఒకటిగా హామీలకు కార్యరూపం ఇస్తామన్నారు. ఆర్టీసీ కళాభవన్‌లో మీ-సేవ 14వ వార్షికోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ధ్వంసం చేసి వెళ్లారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పరిపాలనను గాడిలో పెట్టి ప్రజలకు అధ్బుత ఫలితాలను అందిస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. ప్రతి పక్షాలు ప్రజలలో అనుమానాలు రేకెత్తించేందుకు నానా రకాల అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.