సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో ప్రభుత్వ జోక్యం భక్తుల పాలిట శాపంలా మారిందని ఆలయ అనువంశిక ధర్మకర్త, టీడీపీ నేత అశోక్ గజపతిరాజు అన్నారు. వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం వైఫల్యానికి గల కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని అన్నారు. ఈ మేరకు అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ… తమ పూర్వికులనుండి ఆలయానికి వస్తున్నానని.. ఈ ఏడాది అంత దారుణం ఇంకెప్పుడు చూడలేదన్నారు. స్వామి వారి నిజరూప దర్శనం కోసం వందల రూపాయల ఖర్చు చేసి టికెట్లు కొనుక్కున్న భక్తులు… ఆలయ నిర్వహణ చూసి మండిపడ్డారని అన్నారు. అధికారులేమో వీఐపీ దర్శనం చేసుకొని… మమ్మల్ని పట్టించుకున్నారా అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. విశాఖ శారదాపీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి కూడా అప్పన్న దర్శనానికి వచ్చి ఆలయంలో పరిస్థితులు చూసి ఆగ్రహానికి గురయ్యారని అన్నారు. ఇలాంటి చందనోత్సవం తన జీవితంలో ఎప్పుడు చూడలేనని అన్నారు. సిరిమానోత్సవం, రామతీర్థ ఉత్సవం, సింహాద్రి అప్పన్న చందనోత్సవం…ఇవన్నీ ప్రభుత్వం జోక్యం కారణంగానే నిర్వహణ లోపాలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు.


