సీఎం రేవంత్ రెడ్డికి, ఢిల్లీ పెద్దలకు మధ్య గ్యాప్ పెరిగిందా? రాష్ట్ర మంత్రులు రేవంత్ తీరుపై నేరుగా ఏఐసీసీకి ఫిర్యాదు చేశారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారాయట. సీఎం హోదాలో పాలన మొత్తం రేవంత్ రెడ్డి చేతిలోనే ఉండటంతో.. మంత్రులు అవమానంగా భావిస్తున్నారట. తమకు తగిన ప్రాధాన్యత ఉండటం లేదని, కీలకమైన నిర్ణయాలు సీఎం ఒక్కరే తీసుకుంటున్నారని మంత్రులు భావిస్తున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా నానాటికీ దిగజారుతోందని.. ఇదిలా కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నష్టపోతామని అధిష్టానానికి చెప్పారట. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసినా.. దాని అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పొందలేకపోయింది. పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసుగు చెందారో.. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇద్దామని భావించారో కానీ.. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారు. టీపీసీసీ ప్రెసిడెంట్‌గా దూకుడుగా వ్యవహరించారని, కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కున్నారనే కారణాలతో రేవంత్ రెడ్డిని సీఎం చేశారు. మొదటి రెండు మూడు నెలలు రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉందనిపించినా.. ఆ తర్వాత క్రమంగా వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేయించిన సర్వేలో 10 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులపై వ్యతిరేకత బాగా పెరిగిపోయినట్లు తెలిసింది. అదే సమయంలో సీఎంగా రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కంటే వెనుక బడ్డారని కూడా వెల్లడైందట.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత రావడానికి సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలే కారణమని మంత్రులు భావిస్తున్నారట. ఏకపక్ష ధోరణితో తీసుకున్న కొన్ని నిర్ణయాలే కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెంచాయని అంచనా వేస్తున్నారట. బీఆర్ఎస్ నాయకులపై వరుసగా కేసులు నమోదు చేయిస్తుండటం వల్ల కక్షా రాజకీయాలు జరుపుతున్నారనే సిగ్నల్స్ ప్రజల్లోకి వెళ్లాయని స్వయంగా మంత్రులే వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు నిత్యం కేసీఆర్ మీద చేస్తున్న తీవ్రమైన వ్యాఖ్యలు కూడా రివర్స్ అవుతున్నాయని అధిష్టానానికి మంత్రులు చెప్పారట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కూడా పార్టీకి మైనస్‌గా మారుతుందని.. ఆయా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వ్యతిరేకత పెరిగిందని మంత్రులు భావిస్తున్నారట.
ఇటీవల ఢిల్లీలోని కోట్లా రోడ్‌లో నిర్మించిన ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి రాష్ట్రం నుంచి సీఎం, మంత్రులు అందరూ వెళ్లారు. అయితే ఆ సమయంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో పలువురు మంత్రులు విడిగా సమావేశమయ్యారట. తెలంగాణ మంత్రులు, ముఖ్య నేతలు కలిసి సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయపరమైన అంశాలే కాకుండా.. పాలనలో కలుగుతున్న ఇబ్బందులను కూడా ఏకరవు పెట్టారట. నామినేటెడ్ పోస్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారని.. కొందరు మంత్రులు ఇచ్చిన లిస్టును కూడా పక్కన పెట్టారని వేణుగోపాల్‌కు చెప్పారట.
కీలకమైన బిల్లుల చెల్లింపుల విషయంలో తమకు ఎదురవుతున్న సమస్యల గురించి కేసీ వేణుగోపాల్ వద్ద వాపోయారట. కొన్ని శాఖల బిల్లులు క్లియర్ అవుతున్నప్పటికీ..పలు శాఖల్లో మాత్రం బిల్లులు పెండింగ్‌లో ఉండటం తమకు అవమానంగా ఉందని ఒకింత సీరియస్‌గానే కంప్లైంట్ చేశారని తెలుస్తోంది. బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదు చేయడంతో పాటుగా సీఎం రేవంత్ వ్యవహారశైలిని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారట. ఆర్థిక శాఖ మంత్రికి స్వేచ్చ ఉంది కాబట్టి బిల్లులు ఆయన్నే అడగాలంటూ సీఎం సమాధానం దాటవేస్తున్నారని, అయితే ఫైనాన్స్ మినిస్టర్ మాత్రం… ఖజానాలో నిధులు లేవని, ఆర్థిక పరమైన అంశాల్లో సీఎం పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తమతో చెబుతున్నారని వాపోయారట.
మంత్రుల కంప్లైంట్స్ విన్న కేసీ వేణుగోపాల్ ఆశ్చర్యానికి గురయినట్లు తెలిసింది. ఏకంగా మంత్రులే బిల్లుల చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని చెప్పడంతో ఒకింత షాక్ అయినట్లు సమాచారం. కొన్ని శాఖలకు బిల్లులు క్లియర్ చేసి పలు శాఖల బిల్లులు పెండింగ్‌లో పెట్టడం సరికాదని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. గతంలో కర్ణాటకలో ఇదే రకమైన సమస్య ఎదురైనప్పుడు అన్ని శాఖలకూ నెలవారి కొంత మొత్తం కేటాయించాలనే ప్రతిపాదన తాము చేశామని… అదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా వెల్లడిస్తామని కేసీ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఏదేమైనా రేవంత్ రెడ్డి మీద మంత్రుల ఫిర్యాదుతో.. గతంలో ఉన్న గ్యాప్ మరింత పెరిగిందని పార్టీలో చర్చ జరుగుతోంది. మరి ఈ గ్యాప్‌ను రేవంత్ ఎలా తగ్గిస్తారో వేచి చూడాలి.