స్వతంత్ర వెబ్ డెస్క్: కూకట్‌పల్లి స్థానం నుంచి టిక్కెట్ ఆశించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గొట్టిముక్కల వెంగళరావు శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ నిన్న 45 మందితో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో తమకు అవకాశం దక్కుతుందని భావించిన పలువురు నేతలకు నిరాశ ఎదురైంది. దీంతో పలువురు కాంగ్రెస్ నాయకులు రాజీనామా బాట పడుతున్నారు. తాజాగా గొట్టిముక్కల వెంగళరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూకట్‌పల్లి టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేశారు. కానీ నిన్నటి జాబితాలో శేరిలింగంపల్లికి చెందిన బండి రమేశ్‌కు కూకట్‌పల్లి టిక్కెట్ దక్కింది. దీంతో గొట్టిముక్కల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా గొట్టిముక్కల మాట్లాడుతూ… పార్టీని వీడాలంటే బాధగా ఉందని కంటతడి పెట్టారు. కాంగ్రెస్ పార్టీ కోసం 40 ఏళ్లుగా కష్టపడ్డానన్నారు.