హైదరాబాద్ లో ఉదయం పూట ఎండలు మండిపోతుండగా.. సాయంత్రం పూట వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణాల కోసం ప్రజలు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో నగరంలోని మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇటీవల అమీర్ పేట మెట్రో స్టేషన్లో అయితే ఇసుక వేస్తే రాలనంత జనం కనిపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికుల డిమాండ్ దృష్టిలో పెట్టుకుని మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇక నుంచి రద్దీ మార్గాల్లో షార్ట్ లూప్ ట్రైన్లను నడపనున్నారు. ఈ ట్రిప్పులతో రద్దీ తగ్గడంతో పాటు రైళ్ల కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. అమీర్‌పేట్, సికింద్రాబాద్, మెట్టుగూడ మెట్రో స్టేషన్ల నుంచి షార్ట్ లూప్ ట్రిప్పులను నడపనున్నట్లు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండే అమీర్‌పేట్-రాయదుర్గం కారిడార్‌లో ప్రతి 4.30 నిమిషాలకు ఒక ట్రైన్ అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు మెట్రో ట్రైన్ ఛార్జీల పెంపునకు ప్రభుత్వం విముఖత చూపినట్లు తెలుస్తోంది.