తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్న వేళ..రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అందులోనూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గత నెలలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల.. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశం కావడం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా మళ్లీ ఆయన అసెంబ్లీలో సీఎంను కలిశారు. ఇంతకీ బండ్ల రూటు ఎటు..? ఎందుకీ దాగుడు మూతలు..?
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే పార్టీ మారిన కొద్ది రోజుల్లోనే మళ్లీ మనసు మార్చుకున్న బండ్ల..ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశం కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని కేటీఆర్‌తో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్‌లోకి వచ్చిన నెల రోజులు కాకముందే తిరుగుపయనం అవుతున్నారన్న పుకార్లతో అధికార పార్టీ అలర్ట్ అయింది. ఇలా వచ్చిన మరికొంత మంది ఎమ్మెల్యేలు తిరిగి సొంతగూటికి వెళితే జరిగే ప్రమాదాన్ని గుర్తించి చర్చలు ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితోపాటు గద్వాల వెళ్లి మంతనాలు జరిపారు. సుమారు రెండు గంటల చర్చల తర్వాత కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని మంత్రి జూపల్లి… ప్రకటించారు. పాత పరిచయాల కారణంగా ఆయన బీఆర్‌ఎస్ నేతలతో మాట్లాడరని క్లారిటీ ఇచ్చారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని గుర్తు చేశారు.
చర్చల తర్వాత తనతోపాటు కృష్ణమోహన్ రెడ్డిని హైదరాబాద్ తీసుకొచ్చారు జూపల్లి కృష్ణారావు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అసలు కేటీఆర్‌ను ఎందుకు కలవాల్సి వచ్చింది. తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లబోతున్నట్టు పుకార్లు ఎలా వచ్చాయనే దానిపై వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన నియోజకవర్గ సమస్యల చిట్టాను కూడా సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంచారనే ప్రచారం జరుగుతోంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి సీఎంను కలవడంతో ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే.. తన జంపింగ్ ఎపిసోడ్‌పై ఇంత చర్చ జరుగుతున్నా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. బహిరంగంగా మీడియా ముఖంగా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. దీంతో అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదని కేడర్ చెబుతున్నారు. మరి బండ్ల ఎపిసోడ్ ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.