స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రత్యేక్ష రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకోవాలని.. ప్రజలకోసం యుద్ధం చేయాలనీ ప్రజా యుద్ధనౌక గద్దర్ డిసైడ్ అయ్యారు. ఆ పార్టీ.. ఈ పార్టీలో చేరడం కాకుండా.. సొంత పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. కొత్త రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీ వెళ్లారు గద్దర్. దానిలో భాగంగా ఇవాళ ఎన్నికల కమిషన్‌తో భేటీ కానున్నారు. గద్దర్ ‘ప్రజా పార్టీ’ పేరుతో కొత్త పార్టీ పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. పాటతోనే ప్రస్థానాన్ని ప్రారంభించి.. పాటతోనే ప్రజా ప్రస్థానాన్ని ముగిస్తానని చెప్పిన గద్దర్.. ఇప్పుడు కొత్త పార్టీకి అంకురార్పణ చేయటం ఆసక్తిగా మారుతోంది. నిజానికి.. గద్దర్ విప్లవానికి, పోరాటానికి ప్రతీక. అందుకే.. గద్దర్ తన కొత్త పార్టీ జెండాను మూడు రంగులతో రూపొందించినట్లు తెలుస్తోంది. అలాగే.. జెండా మధ్యలో పిడికిలిని పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. జెండాలో ఎరుపు, నీలి, ఆకుపచ్చ రంగులు ఉండబోతున్నాయి. ఇదిలావుంటే.. గద్దర్ తన ప్రయాణాన్ని ఎరుపురంగుతోనే ప్రారంభించారు. గద్దర్ మొదట అంబేద్కరిస్టు.. కాలానుగుణంగా వామపక్ష రాజకీయాలపై ఆకర్షితులయ్యారు. అందుకే… జెండాలో నీలి రంగు తప్పకుండా ఉంటుందని భావిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా గద్దర్ రాజకీయ ప్రవేశం వార్తలతో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. అయితే కేసీఆర్ ప్రభుత్వాన్ని తన మాటలతో, పాటలతో ఎండగడుతుండడంతో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తారనే ప్రచారమూ జరిగింది. అదేసమయంలో.. కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ నుంచే పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ.. సడెన్‌గా ఇప్పుడు గద్దర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం జరగటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.


