స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండే నేతలు తాజాగా ఐక్యతా రాగం అందుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. నల్గొండ పట్టణంలో శుక్రవారం రాత్రి కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన దీక్షా సభ జరిగింది. ఈ సభకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, వీహెచ్ తదితర నాయకులు హాజరయ్యారు.
అయితే ఈ సభకు ఉప్పు నిప్పులా ఉండే నేతలు హాజరుకావడం ఒక ఎత్తయితే.. వారంతా దోస్త్ మేరా దోస్త్ అంటూ ఆలింగనాలు చేసుకోవడం మరో ఎత్తు. అంతేకాకుండా ఒకరి పట్ల ఒకరు పొగడ్తల వర్షం కురిపించుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ హఠాత్ పరిణామాలతో కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్లో ఉంటే ప్రత్యర్థుల నేతలు మాత్రం షాకులో ఉన్నారు.
రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి వచ్చిన దగ్గరి నుంచి సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాకుండా వీలు చిక్కినప్పుడల్లా రేవంత్ పై విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ తాజాగా నల్గొండ నిరుద్యోగ నిరసన దీక్షలో మాత్రం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి ప్రశంసలు కురిపించారు. రేవంత్ రెడ్డి సైతం కోమటిరెడ్డి మంచి మిత్రుడు, ఆప్తుడు అని చెప్పడం కాంగ్రెస్ కార్యకర్తలను సంతోషంలో నింపింది.
ఎన్నికలు అయ్యేంత వరకు నేతలందరూ ఇలాగే కలిసి ఉంటే ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చర్చించుకుంటున్నారు. మరి దోస్తుల్లాగా ఇప్పటిలాగే కలిసి ఉంటారా? లేక యథాప్రకారం ఎవరి దారిలో వారు ఉంటారా? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాలి.