సంక్రాంతి తర్వాత క్యాడర్‌తోనే తానంటున్న జగన్.. ఎందుకంటే? ఇప్పటికైనా బాస్ క్యాడర్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని చర్చించుకుంటున్నారట నేతలు. ఇక నుంచి మీకోసం.. మీ వెంటే.. మీ జగన్ అన్న.. అంటూ కొత్త స్లోగన్ అందుకున్నారు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నానని.. ఎలాంటి కష్ట పరిస్థితుల్లోనైనా కార్యకర్తలకు అండగా ఉంటానంటున్నారు. ప్రతి బుధ, గురువారం కార్యకర్తలతోనే గడపనున్నారట.
డిస్ట్రిక్ టూర్లలో భాగంగా పార్టీ బలోపేతం కోసం కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తానంటున్నారు. ఇది కష్టకాలం ధైర్యంగా ఉండండి..మీకేదైనా కష్టం అనిపిస్తే తనను గుర్తు తెచ్చుకోండి అంటూ సూచిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి.. జైలుకు పంపినా భయపడలేదని.. పోరాడుతూ వచ్చానని..ఇప్పుడు అపోజిషన్‌లో కూడా ఫైట్ చేస్తున్నానని క్యాడర్‌కు హితబోధ చేశారు జగన్.
ఇదంతా బానే ఉంది కానీ..గతం పరిస్థితి ఏంటని క్వశ్చన్ చేస్తున్నారట కార్యకర్తలు.. కొందరు లీడర్లు. పార్టీ పెట్టినప్పటి నుంచి అండగా ఉంటూ వస్తే అధికారంలో ఉన్నప్పుడు మీరు మాకిచ్చిన మర్యాదేంటని ప్రశ్నిస్తున్నారట. కార్యకర్తకు ప్రజల్లో విలువ లేకుండా చేసి..వాలంటీర్ల పేరుతో పార్టీని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. పార్టీ కోసం సర్వం త్యాగం చేసి జెండా మోస్తే..తీరా అధికారంలోకి వచ్చాక ఏం చేశారో గుర్తు తెచ్చుకోవాలని సూచిస్తున్నారట. ఇప్పుడు అపోజిషన్‌లోకి వచ్చాక మళ్లీ కార్యకర్తలకే టైమ్ కేటాయిస్తాననడం ఏంటో అర్థం కావడం లేదని గుసగుస పెట్టుకుంటున్నారట.
క్యాడర్‌కు గ్రామీణ స్థాయిలో గుర్తింపు ఏది.?
జగన్ కాంగ్రెస్‌ను వీడి పార్టీ పెట్టినప్పటి నుంచి లక్షలాది మంది కార్యకర్తలు ఆయన వెంట నడిచారు. టీడీపీని, తర్వాత జనసేనను ఎదుర్కొని నిలబడ్డారు. తీరా పవర్‌లోకి వచ్చాక క్యాడర్‌ను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడంలో జగన్ ఫెయిలయ్యారన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. 2019లో అధికారంలోకి వస్తూ వస్తూనే వేల మంది వాలంటీర్లను నియమించడం..వాళ్ల ద్వారే ప్రభుత్వ పథకాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు ఇచ్చేయడంతో క్యాడర్‌తో పనిలేకుండా చేశారు.
దాంతో క్యాడర్‌కు గ్రామీణ స్థాయిలో గుర్తింపు లేకుండా పోయింది. వాళ్లతో పనేం లేదన్నట్లుగా సీన్ మారిపోవడంతో కార్యకర్తలతో పార్టీకి గ్యాప్ వచ్చినట్లు అయింది. అది మొన్నటి ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. దీంతో క్యాడర్ విషయంలో జగన్ యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీ పటిష్టంగా ఉండాలన్నా.. మళ్లీ అధికారంలోకి రావాలన్నా..క్యాడర్ తలుచుకుంటేనే అవుతుందని జగన్ భావించినట్లు స్పష్టం అవుతోంది. తనను చూసి మాత్రమే ఓటేయాలన్న జగన్..ఇప్పుడు కార్యకర్తలే పార్టీ బలమని ఓ క్లారిటీకి రావడం ఆసక్తికరంగా మారింది.
జగన్ కామెంట్స్‌పై వైసీపీ వర్గాల్లోనే ఆసక్తికర చర్చ జరుగుతోందట. ఇప్పటికైనా బాస్ క్యాడర్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని చర్చించుకుంటున్నారట నేతలు. అధికారంలో ఉన్నప్పుడు క్యాడర్ విషయంలో ఎన్నిసార్లు చెప్పినా వినలేదని..పోనిలే ఇప్పుడైనా కార్యకర్తలతో టచ్‌లో ఉంటానంటున్నారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. క్యాడర్, లీడర్లతో సమన్వయం చేసుకోవాలని..గతంలో ఇచ్చిన పథకాలే మళ్లీ గెలిపించవని గ్రహిస్తే బాగుంటుందని చర్చించుకుంటున్నారట లీడర్లు. చూడాలి మరి జగన్ భరోసాతో..అపోజిషన్‌పై పోరులో క్యాడర్ ఎంత వరకు కలసి వస్తుందనేది.