స్వతంత్ర వెబ్ డెస్క్: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 5 హామీల్లో కీలకమైంది. .మహిళలకు ఉచిత బస్ సౌకర్యం. “శక్తి యోజనే” పథకంలో భాగంగా ఇది అమలు చేస్తామని చెప్పారు సీఎం సిద్దరామయ్య. అధికారికంగా ఈ స్కీమ్‌ని నేటి నుంచి ప్రారంభించారు. ఈ పథకంతో ఇకపై కర్ణాటకలోని మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించొచ్చు. బెంగళూరులోని విధాన సౌధలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ పథకాన్ని లాంఛ్ చేశారు. పథకం ప్రారంభానికి సూచికగా ఐదుగురు మహిళలకు ఉచిత టికెట్లను అందజేశారు. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, కల్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ పరిధిలో నడుపుతున్న బస్సుల్లో ఈ శక్తి పథకం ప్రయోజనాలను పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. బీఎమ్‌టీసీ కాకుండా మిగతా మూడు ఆర్టీసీలకు సంబంధించిన బస్సుల్లో పురుషులకు 50 శాతం సీట్లు రిజర్వ్ చేస్తామని చెప్పింది. మహిళా ప్రయాణికులు ప్రయాణించే దూరాన్ని బట్టి.. ఆయా రోడ్డు ట్రాన్స్ప్రోర్ట్ కార్పొరేషన్లకు రీయింబర్స్మెంట్ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
అవసరమైన చోట బస్సు సర్వీసులను పెంచుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. మూడు నెలల్లో స్మార్ట్ పాసెస్ విడుదల చేస్తామని.. మహిళల గోప్యతకు భంగం కలగకుండా వీటిని జారీ చేస్తామని చెప్పారు. ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్న పథకంతో 4.18 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. పేదలు, దిగువ మధ్యతరగతి, కార్మిక మహిళలకు ఈ పథకంతో నగదు ఆదా చేసుకోవచ్చని తెలిపారు. లైంగిక అల్పసంఖ్యాకులూ అర్హులేనని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 18,609 బీఎంటీసీ, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఉచిత ప్రయోజనం కోసం ఏటా రూ.4051.56 కోట్లు ఖర్చు వస్తుందని ప్రభుత్వం అంచనా.