సామాన్యులకే కాదు, ఏకంగా అసోం మాజీ ముఖ్యమంత్రి ప్రపుల్ల కుమార్ మహంతా కుమార్తెకు కూడా వేధింపులు తప్పడం లేదు. దీంతో తనను వేధించిన కారు డ్రైవర్ ను చెప్పుతో కొట్టి బుద్ది చెప్పింది మహంతా కూతురు.
ఆడపిల్లలను పోకిరీలు వేధించడం, అప్పుడప్పుడు సదరు పోకిరీలకు దేహశుద్ధి ..ఇవన్నీ మనం చాలా చూసి ఉంటాం. అయితే ఇలా ఆడపిల్లలను వేధించేవారు సహజంగా బయటివారు అయి ఉంటారు. అయితే సాక్షాత్తూ యజమాని కూతురినే వేధించాడు ఓ ప్రబుద్ధుడు. చివరకు సదరు అమ్మాయి చేతిలో చెప్పు దెబ్బలు తిన్నాడు.
అసోం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంతా కూతురు ..ఓ పోకిరి వేధింపులకు గురైంది. సదరు పోకిరి ఎవరో కాదు…ఆమె కుటుంబ కారుకు డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తే. వేధించడమే కాదు…మద్యం మత్తులో ఆ అమ్మాయిని ఈ డ్రైవర్ బాగా దూషించాడు. దీంతో కోపం పట్టలేక, డ్రైవర్ కు దేహశుద్ది చేసింది మహంతా కూతురు.
ఈ సంఘటనకు సంబంధించి అమె వివరణ ఇచ్చింది. ఆ అమ్మాయి చెప్పిన వివరాల ప్రకారం ఆ డ్రైవర్ …చాలా కాలం నుంచి మహంతా కుటుంబం దగ్గరే పనిచేస్తున్నాడు. అయితే ఈ డ్రైవర్ కు తాగుడు అలవాటు బాగా ఎక్కువ. దీంతో తాగినప్పుడల్లా మహంతా కుమార్తెను వేధించడం అలాగే దూషించడం చేసేవాడు. అయితే సదరు డ్రైవర్ కు కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయి. దీంతో డ్రైవర్ విషయంలో చూసీ చూడనట్లు పోయేవారు మహంతా కుమార్తె. పాత డ్రైవర్ కదా…అని కాస్తంత సానుభూతి కూడా చూపించేవారు. అయితే సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది.
తాజాగా తాగిన మత్తులో మరోసారి తన బుద్ధి చూపించాడు. మహంతా కుమార్తె ఉన్న గది తలుపులు గట్టిగా కొట్టాడు. ఆ అమ్మాయి ఎంతకూ తలుపులు తీయకపోయేసరికి గట్టిగా అరుస్తూ దూషించడం మొదలెట్టాడు. దీంతో ఆ ఆమ్మాయి సహనం కోల్పోయింది. పట్టరాని కోపంతో చెప్పు తీసుకుని ఫట్ ఫట్ మని వాయించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికైనా డ్రైవర్ బుద్ధి తెచ్చుకుంటాడని భావిస్తున్నట్లు మహంతా కుమార్తె పేర్కొన్నారు. ప్రఫుల్ల కుమార్ మహంతా అసోం రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. గౌహతి విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా మహంతా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మహంతా కుటుంబం, ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉంటోంది.