ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో మహకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి తాను చేసిన ‘వేలాది మృతులు’ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలంటే ఓ షరతు పెట్టారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే.
జనవరి 29న మౌనీ అమావాస్య రోజు అమృత స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది చనిపోయారని.. 60 మంది గాయపడ్డారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పుణ్యస్నానాల కోసం అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు.. బారికేడ్లను తోసుకుంటూ ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట జరిగిందని చెప్పారు.
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లి కార్జున ఖర్గే మాట్లాడుతూ.. అధికారులు ప్రకటించిన మృతుల సంఖ్య నమ్మశక్యంగా లేదని అన్నారు. తన లెక్క ప్రకారం వెయ్యి మంది చనిపోయి ఉంటారని చెప్పారు.
“మహా కుంభమేళాలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తున్నా … కుంభంలో మరణించిన వేలాది మంది” అని ఆయన సభలో అనగానే.. అధికార కూటమి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇది తన అంచనా మాత్రమే అని.. ఇందులో నిజం లేకపోతే అసలు నిజం ఏమిటో ప్రభుత్వమే చెప్పాలని ఖర్గే సభలో కోరారు. ఎవరినో నిందించడం కోసం తాను వేల మరణాలు అని చెప్పలేదని అన్నారు. ఎంత మంది చనిపోయారో ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని కోరారు. తాను తప్పు మాట్లాడినట్టయితే క్షమాపణ కోరతానని అన్నారు. ప్రభుత్వం కనీసం చెప్పాలి.. ఎంత మంది చనిపోయారు.. ఎంత మంది గాయపడ్డారు.. అని ఖర్గే ప్రశ్నించారు.
ఖర్గే వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖర్గే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ కోరారు. ఈ సభలో మాట్లాడే వ్యాఖ్యలకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని అన్నారు. “ఇక్కడి నుంచి వెళ్లే సందేశం .. విరుద్ధంగా ఉన్నా… ప్రపంచం మొత్తానికి వెళ్తుంది. అంత దాకా వెళ్లాలని ఉందా..? దేశంలోని సీనియర్ నేతల్లో మీరూ ఒకరు కాబట్టి.. నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా”.. అని ధన్‌ఖడ్ అన్నారు.
పవిత్రమైన రోజున మహాకుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసీ కూడా కేంద్రం, యూపీ ప్రభుత్వం సరైనా భద్రతా చర్యలు చేపట్టడంలో విఫలమయ్యాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.
వసంత పంచమి సందర్భంగా 3 కోట్ల మంది
సోమవారం వసంత పంచమి సందర్భంగా కూడా, లక్షలాది మంది భక్తులు మహా కుంభమేళా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. సోమవారం మొత్తం 3 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించేందుకు అవకాశం ఉందన్న అంచనాలతో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకుని సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తెల్లవారుజామున 3.30 గంటల నుంచే లక్నోలోని తన నివాసంలోని వార్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు.
77 మంది మహిళా అధికారులు సహా కనీసం 270 మంది ఐపీఎస్ అధికారులు ప్రయాగ్‌రాజ్‌లో తమ సేవలు అందిస్తున్నారు. ఏదైనా ముఖ్యమైన రోజు ఉంటే దానికంటే ముందు రోజు నుంచే వీవీఐపీలు రాకుండా నియంత్రిస్తున్నారు . ఫలానా ఘాట్‌కే వెళ్లి పుణ్యస్నానాలు చేయాలనే ఆలోచన చేయకుండా వీలును బట్టి ఘట్‌ను ఎంచుకోవాలని అక్కడి అధికారులు సూచిస్తున్నారు.