- కర్ణాటకలోని తిరుమణి సోలార్ ప్లాంట్ పరిశీలన..తిరుగు ప్రయాణంలో లేపాక్షి సందర్శన
- పోలీసుల వలయంలో లేపాక్షి..500 మంది పోలీసులతో గట్టి బందోబస్తు
- విదేశీ బృందం రాకతో దుకాణాల మూసివేత..పర్యాటకులకు నో ఎంట్రీ

లేపాక్షి సందర్శనకు జి-20 దేశాల ప్రతినిధుల బృందం వస్తోంది. బెంగుళూరులో జరుగుతున్న జి-20 ఎనర్జీ మీట్ నిమిత్తం వచ్చే ఈ బృందం కర్ణాటకలోని పావగడ సమీపంలోని తిరుమణి వద్ద ఉన్న సోలార్ ప్లాంట్‌ను చూడాలని కర్ణాటక ప్రభుత్వం కోరింది. సమీపంలో ఉన్న చారిత్రక ప్రదేశాన్ని సందర్శించాలని బృందం కోరడంతో, కర్ణాటక అధికారులు లేపాక్షిని సూచించినట్లు సమాచారం.

విదేశీ ప్రతినిధుల బృందం రాక సందర్భంగా లేపాక్షి ఆలయాన్ని జిల్లా అధికారులు సిద్ధం చేశారు. బెంగుళూరు నుంచి రోడ్డు మార్గాన ఈ బృందం లేపాక్షి చేరుకుంటుంది. మొదట తిరుమణి వద్ద సోలార్ ప్లాంట్ పరిశీలించి తిరుగు ప్రయాణంలో లేపాక్షిని సందర్శిస్తారు. ఈ బృందంలో 60 మంది విదేశీ ప్రతినిధులు ఉంటారు.