స్వతంత్ర వెబ్ డెస్క్: పక్క రాష్ట్రంలో ఉంటూ అప్పుడప్పుడూ వచ్చి పోయే వాళ్లకు మన రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఎలా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించారు. గురువారం సామర్లకోటలో జరిగిన సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. అవకాశ వాద రాజకీయం చేస్తూ తన అభిమానుల ఓట్లను గంపగుత్తగా అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. పవన్ ను దత్తపుత్రుడని సంబోదిస్తూ విమర్శలు గుప్పించారు. ప్యాకేజీ స్టార్ ది ‘యూజ్ అండ్ త్రో’ పాలసీ అని, హైదరాబాద్ లో ఆయనకు శాశ్వతమైన ఇల్లు ఉందని చెప్పారు. ఇల్లు మాత్రమే శాశ్వతం.. అందులో ఇల్లాలు మాత్రం మూడేళ్లు, నాలుగేళ్లకు ఓసారి మారిపోతారని ఎగతాలి చేశారు. ఒకసారి లోకల్, మరోసారి నేషనల్, ఇంకొకసారి ఇంటర్నేషనల్.. తర్వాత ఇంకెక్కడికి పోతాడోనని వ్యగ్యంగా జగన్ ప్రశ్నించారు.
పెళ్లిళ్లన్నా, ఆడవాళ్లన్నా ఈ పెద్ద మనిషికి అసలు గౌరవమే లేదని ఆరోపించారు. మన ఇళ్లల్లో మన అక్కాచెల్లెల్లను మనమే గౌరవించకుంటే ఎలా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రెండు స్థానాలు.. గాజువాకతో ఈ ప్యాకేజీ స్టారుకు సంబంధం లేదు, భీమవరంతోనూ అనుబంధం లేదని విమర్శించారు. ఈ రెండు నియోజక వర్గాలను తనకో పనిముట్లుగా చూస్తాడని, యూజ్ అండ్ త్రో లా వాడుకుంటాడని జగన్ ఆరోపించారు. అభిమానుల ఓట్లను హోల్ సేల్ గా అమ్ముకోవడానికే షూటింగ్ గ్యాప్ లో రాష్ట్రానికి వస్తూ పోతూ ఉంటాడని పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీని, సొంత వర్గాన్ని వేరే వారికి అమ్ముకునే వ్యాపారి పవన్ కల్యాణ్ మాత్రమేనని జగన్ విమర్శించారు.